logo

బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు

బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు..

Published : 08 Dec 2023 01:43 IST

అల్లాదుర్గం: బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మైనర్‌తో మూడు నెలల కిందట వివాహం నిశ్చయమైంది. అప్పట్లోనే విషయం తెలియంతో ఐసీడీఎస్‌ అధికారులు ఇరు కుటుంబ సభ్యులను, యువకుడిని, బాలికను మెదక్‌లోని ఐసీడీఎస్‌ కార్యాలయానికి రప్పించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాల్య వివాహంతో కలిగే నష్టాలను వివరించారు. కొన్ని రోజులకు పెళ్లి చేసుకోగా విషయం గురువారం తెలిసింది. దీనిపై ఐసీడీఎస్‌ అధికారులు అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.


పోక్సో కేసులో ఒకరికి జైలు, జరిమానా

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఫోక్సో కేసులో సిద్దిపేట న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. పట్టణ మూడో ఠాణా సీఐ భానుప్రకాశ్‌ తెలిపిన వివరాలు.. మూడో ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో 2021 జూన్‌ 12న రాములు అనే వృద్ధుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సంపత్‌ కేసు పెట్టి నేరస్థుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్‌ వేశారు. అప్పట్నుంచి విచారణ కొనసాగింది. వాదనలు విన్న న్యాయస్థానం గురువారం నేరస్థుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది.


పోలీసుల అదుపులో మల్లన్న దేవాలయ ఆడిటర్‌

నంగునూరు(చేర్యాల), కొమురవెల్లి, న్యూస్‌టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఐటీ, జీఎస్టీ రిటర్నుల దాఖలు నిధుల దుర్వినియోగంపై ఆలయ ఈవో బాలాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని రోజుల కిందట దేవాలయ ఆడిటర్‌ ధనుంజయపై కేసు పెట్టారు. ఈ మేరకు గురువారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయమై చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా.. ధనుంజయను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని