logo

అదృశ్యమైన మహిళ దారుణ హత్య

అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా మద్కల్‌కు చెందిన దంపతులు మొహమ్మద్‌, సర్వాబీ(42) బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చారు.

Published : 08 Dec 2023 01:48 IST

సర్వాబీ

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా మద్కల్‌కు చెందిన దంపతులు మొహమ్మద్‌, సర్వాబీ(42) బతుకుదెరువు కోసం తాండూరుకు వచ్చారు. దన్‌గర్‌ గల్లీ ప్రాంతంలో అద్దెకు ఉంటూ కూలీలుగా జీవిస్తున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు. ఆడ పిల్లలకు వివాహాలయ్యాయి. గత నెల 29న ఇంటి నుంచి ఉదయం అడ్డా మీదకు పనులకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవటంతో ఈ నెల 1న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్డా వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి ఆమెను ఇందిరాగాంధీ కూడలి వైపు తీసుకెళ్తున్నట్లు కన్పించింది. అతన్ని ధారూర్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన కిష్టప్పగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె చరవాణి సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా పెద్దేముల్‌ మండలం తట్టేపల్లి అడవిలో కుళ్లిపోయిన సర్వాబీ మృతదేహం కన్పించింది.


పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

బైరి రాకేశ్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుడాటిపల్లి పరిధి తెనుగుపల్లికి చెందిన బైరి వెంకటయ్య పెద్ద కుమారుడు బైరి రాకేశ్‌(25) ఇంటర్‌ వరకు చదివి మానేశాడు. ట్రాక్టర్‌తోపాటు వరికోత యంత్రం నడిపేవాడు. కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈ విషయమై ఆయన తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన రాకేశ్‌ ఈనెల 5న వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మొదట హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కణ్నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అక్కన్నపేట ఎస్సై వివేక్‌ తెలిపారు.


శిరిడీ వెళ్తున్న ప్రైవేటు బస్సు దగ్ధం

మునిపల్లి: హైదరాబాద్‌ నుంచి శిరిడీకి వెళ్తున్న ఎస్‌వీఆర్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా శివారులోని హైవేపై గురువారం రాత్రి దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో 38 మంది ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పొగలు వస్తుండగా గమనించిన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కకు నిలిపారు. ప్రయాణికులు సామగ్రి తీసుకొని దిగిపోయారు. స్థానికులు గమనించి సదాశివపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా ఆ శకటం వచ్చేసరికి బస్సు కాలిపోయింది. హైవేపై రద్దీ ఏర్పడగా పోలీసులు చేరుకొని వాహనాలను క్రమబద్ధీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని