logo

ఇంట్లో శుభకార్యం.. అంతలోనే విషాదం

కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్‌పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్‌ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.

Published : 08 Dec 2023 06:32 IST

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం

నగేష్‌

చేగుంట, న్యూస్‌టుడే: కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్‌పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్‌ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ హరీశ్‌ తెలిపిన వివరాలు.. మక్కరాజుపేటకు ఎర్రగొల్ల రమేష్‌, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నగేష్‌ (11), చిన్న కుమారుడు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు, నాలుగో తరగతి చదువుతున్నారు. వ్యవసాయమే జీవనాధారం. ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం గృహప్రవేశం ఉండగా.. తెల్లవారుజామున కార్యక్రమం జరిగింది. 10 గంటల సమయంలో నగేష్‌ను సరకులు తీసుకురమ్మని సమీపంలోని ఓ దుకాణానికి పంపించారు. సైకిల్‌పై దుకాణానికి బయల్దేరాడు. రోడ్డు పక్కన మెల్లిగా వెళ్తున్నాడు. వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్‌ వెనుక నుంచి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కంటెయినర్‌ డ్రైవర్‌ హరియాణాకు చెందిన హసీన్‌ చరవాణిలో మాట్లాడుతున్నాడు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులంతా ఘటనాస్థలికి చేరుకొని రోదించారు. కంటెయినర్‌ డ్రైవర్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్థులతో కలిసి చేగుంట-గజ్వేల్‌ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మిబాబు ఘటనా స్థలికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పేందుకు యత్నించగా ఫలితం లేకపోయింది. చివరకు కంటెయినర్‌ యజమానిని పిలిచించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ చెప్పారు.


ప్రమాదవశాత్తు కింద పడి కానిస్టేబుల్‌..

లక్ష్మణ్‌

వట్పల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించేలోపు కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌ మృతి చెందినట్లు ఎస్సై కోటేశ్వర్‌రావు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఖాదీరాబాద్‌ గ్రామానికి చెందిన పుట్ల లక్ష్మణ్‌(38) సంగారెడ్డిలోని ప్రత్యేక పోలీసు బలగాల విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా సంగారెడ్డిలోనే నివాసం ఉంటున్నారు. తన తల్లి రత్నమ్మను చూసి వెళ్లేందుకు సొంత గ్రామమైన ఖాదీరాబాద్‌కు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తుండగా శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వైద్య చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే లక్ష్మణ్‌ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రమలీల గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని