logo

అన్నదాతల హైరానా

పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Published : 08 Dec 2023 02:09 IST

పాడి పశువులపై అడవిజంతువుల దాడి
నెల రోజుల్లో 11 దూడల మృత్యువాత
న్యూస్‌టుడే- చిన్నకోడూర్‌, నంగునూరు, హుస్నాబాద్‌ గ్రామీణం

పెద్ద కోడూర్‌లో అమర్చిన ట్రాప్‌ కెమెరా

పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నెల రోజుల వ్యవధిలో అడవి జంతువుల దాడిలో 11 దూడలు మృత్యువాత పడటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ పరిస్థితి..

చిన్నకోడూర్‌ మండలంలో వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన పాడిపశువులపై అడవి జంతువులు దాడి చేస్తున్నాయి. పొలాల వద్ద పశుగ్రాసం, తాగునీరు ఉండడంతో పగలంతా మేత మేపి సాయంత్రం అక్కడే కట్టేస్తున్నారు. యజమానులు రాత్రిపూట అక్కడ ఉండకపోవడంతో గుర్తుతెలియని అడవిజంతువులు దాడికి పాల్పడుతున్నాయి. మండలంలోని పెద్దకోడూర్‌లో ఈనెల 3న వ్యవసాయ బావివద్ద రెండు దూడలను అడవి జంతువులు చంపేశాయి. ఆ మరుసటి రోజు మాచాపూర్‌లో 4 దూడలు మృతిచెందాయి. అంతకుముందు మండలంలోని పెద్ద కోడూర్‌లో 5 దూడలు బలయ్యాయి.

గుర్తించని అటవీశాఖ అధికారులు

పాడిపశువులపై దాడి చేస్తున్న అడవిజంతువులను అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు గుర్తించలేదు. నెల రోజుల్లో 11 దూడలు మృతి చెందాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాడులు జరిగిన గ్రామాల్లో రైతుల పొలాల వద్ద ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. జంతువుల పాదముద్రలు సేకరించినా ఇప్పటివరకు గుర్తించలేదు. కుక్కలే దాడి చేసి చంపుతున్నట్లు అటవీశాఖ అధికారులు   చెబుతున్నారు. కుక్కలు రాత్రిపూట దూడలపై దాడి చేయవని అన్నదాతలు అంటున్నారు. నాలుగేళ్ల కిందట అక్కన్నపేట, హుస్నాబాద్‌ మండలాల్లో అడవిజంతువులు దూడలను హతమార్చాయి. అధికారులు వాటి పాదముద్రల ఆధారంగా హైనాలుగా గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేసినా చిక్కలేదు. ఇక్కడా హైనాలే దాడులు చేస్తున్నాయేమోనని రైతులు భావిస్తున్నారు. హైనాలు సమీపంలోని అటవీప్రాంతం, గుట్టలను ఆవాసంగా చేసుకుని రాత్రిపూట దాడులకు పాల్పడుతుంటాయి. పెద్దకోడూరు, మాచాపూర్‌ పరిసరాలు, శివారులో అటవీప్రాంతంతోపాటు గుట్టలు ఉన్నాయి. దాడుల్లో మృతిచెందిన దూడలకు ప్రభుత్వం అటవీశాఖ ద్వారా పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి
- సుంచు నర్సయ్య, మాచాపూర్‌

ఇటీవల పొలం వద్ద దూడ మృతిచెందింది. దీంతో ఆవు పాలు ఇవ్వడం లేదు. మా ఊళ్లో ఇప్పటికే మూడు దూడలపై అటవీ జంతువులు దాడి చేసి హతమార్చాయి. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా పరిహారం ఇప్పించాలి.


అడవి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
- ఇక్రమొద్దీన్‌, ఎఫ్‌ఆర్‌వో

దూడలపై దాడులకు పాల్పడుతున్న జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. దాడులు జరిగిన ప్రదేశాల్లో ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు వాటిలో నమోదు కాలేదు. ఒక చోట కుక్క సంచరించినట్లు నమోదైంది. దాడులకు పాల్పడుతోంది కుక్కలా లేదా వేరే ఇతర జంతువులా అనేది గుర్తించే పనిలో ఉన్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని