logo

హుస్నాబాద్‌.. మంత్రి పదవితో హుషార్‌

పొన్నం ప్రభాకర్‌ మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధికి బాటలు పడతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Dec 2023 02:17 IST

కార్యకర్తల్లో జోష్‌
వైద్య కళాశాలకు ఎదురుచూపులు
న్యూస్‌టుడే, హుస్నాబాద్‌

పొన్నం ప్రభాకర్‌ మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధికి బాటలు పడతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెండింగు  పనులు పూర్తవుతాయని, మస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో  మంత్రి ముందు అనేక సవాళ్లున్నాయి. పెండింగు రిజర్వాయర్ల పనులు, భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంతోపాటు కొత్తగా ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించాల్సి ఉంది. గత పాలకులు సిద్దిపేట, గజ్వేల్‌ అభివృద్ధిపై మాత్రమే శ్రద్ధ చూపారని, హుస్నాబాద్‌ను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. నియోజకవర్గం వివక్షకు గురై అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

ఇంకా రాని సాగునీరు

మెట్టప్రాంతం హుస్నాబాద్‌ నియోజకవర్గానికి సాగునీరందించడానికి 2007లో అప్పటి సీఎం వైఎస్‌ గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటిలో గౌరవెల్లి రిజర్వాయరు నిర్మించి కొంత నీటిని నింపారు. పొలాలకు నీరందించడానికి కాలువలు మాత్రం నిర్మించలేదు. గండిపల్లి రిజర్వాయరు నేటికీ పూర్తి కాలేదు. తోటపల్లి రిజర్వాయరు కోసం భూములు సేకరించాక దాన్ని రద్దు చేశారు.

గౌరవెల్లి రిజర్వాయరు

ఎన్నికల వేళ హామీల వర్షం..

ఆర్నెల్ల కిందట పాదయాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి గండిపల్లి రిజర్వాయరును పరిశీలించారు. అధికారంలోకొస్తే దీంతోపాటు గౌరవెల్లిని పూర్తి చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ల నిర్మాణాలను పూర్తి చేసి నీరందిస్తానని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్‌ అన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, గిరిజన ప్రాంతంలో మినీ ఐటీడీఏ, ఆటోనగర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య కళాశాల ప్రారంభిస్తామని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల సభలో చెప్పారు. హుస్నాబాద్‌లో సబ్‌ కోర్టు ఏర్పాటు, బస్‌డిపో ఆధునికీకరణ, సర్వాయ పాపన్న గుట్టలు, మహాసముద్రం, ఎల్లమ్మ చెరువు, రాయికల్‌ జలపాతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కరీంనగర్‌ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌ మీదుగా జనగాం వరకు రాష్ట్ర రహదారిగా తీరిదిద్దుతామన్నారు. హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధిపరచడంతోపాటు మండల కేంద్రాల్లోని ఆసుపత్రులను 30 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిగా హామీల అమలుకు ఏ మేరకు కృషి చేస్తారో వేచి చూడాలి.


‘పొన్నం.. మేమున్నాం’

రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన పొన్నంను నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం కలిసొచ్చింది. వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమేనని రాజకీయ విశ్లేషకులు భావించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లను సమీక్షించుకొని హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. మూడుసార్లు పార్లమెంటు ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి మంచి ఓట్లు వచ్చాయి. కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు మకాం మార్చుకుంటున్నట్లు ఆగస్టులో ప్రకటించారు. ఇల్లు అద్దెకు తీసుకొని కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల పేర్లను కరీంనగర్‌ జాబితా నుంచి హుస్నాబాద్‌లోకి మార్చుకున్నారు. న్యాయవాద వృత్తిలో భాగంగా ప్రభాకర్‌, ఆయన సతీమణి మంజుల ఇద్దరూ హుస్నాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నారు. ఇంటి నిర్మాణానికి స్థలం కొన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడే నాటికి పట్టణంలో ఉదయం నడకలో స్థానికులను కలుస్తూ పరిచయాలు పెంచుకున్నారు. మరోవైపు హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. పార్టీ టికెట్‌ కోసం ప్రవీణ్‌రెడ్డి, ప్రభాకర్‌ దరఖాస్తు చేసుకున్నారు. చివరికి పొన్నంకు టికెట్‌ వచ్చింది. అసంతృప్తితో ఉన్న ప్రవీణ్‌రెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది. మిత్రపక్షమైన సీపీఐతోనూ కలిసిపోయారు. ఎన్నికల్లో విజయం సాధించిన పొన్నం మంత్రి అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని