logo

అల్పాహారం కొందరికే!

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అల్పాహారం పంపిణీ కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న 17 మండలాల్లో కేవలం పదుల సంఖ్యలోని బడుల్లో మాత్రమే అల్పాహారం పంపిణీ చేస్తున్నారు.

Published : 08 Dec 2023 06:32 IST

చాలా పాఠశాలల్లో ప్రారంభానికి నోచని పథకం
అమలవుతున్న చోట పర్యవేక్షణ కరవు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, మనూరు, సిర్గాపూర్‌

అల్లీపూర్‌లో నాణ్యతలేని ఉప్మా తింటున్న విద్యార్థులు

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అల్పాహారం పంపిణీ కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న 17 మండలాల్లో కేవలం పదుల సంఖ్యలోని బడుల్లో మాత్రమే అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అక్షయ పాత్రతో సంబంధం లేకుండా వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న మిగతా పాఠశాలల్లోనూ అల్పాహారం పథకం పూర్తిగా అమలు కావడం లేదు. అమలవుతున్న కొన్ని బడుల్లో మెనూను పాటించడం లేదు. ఉప్మా, అటుకులు వడ్డిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్త పరిశీలన కథనం.

17 మండలాల్లో నామమాత్రం

జిల్లాలో మొత్తం 28 మండలాలున్నాయి. 17 మండలాల్లోని పాఠశాలల్లో అక్షయ పాత్ర సంస్థ ద్వారా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిసున్నారు. ఉదయం అల్పహారం కూడా ఈ సంస్థ ద్వారానే అందించాల్సి ఉంది. ఒప్పందం కొలిక్కి రాకపోవడంతో వీరు అల్పాహారం అందించడం లేదని సంగారెడ్డిలోని ఓ ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ మండలాల పరిధిలో 612 పాఠశాలలు ఉంటే కేవలం 12 చోట్ల మాత్రమే అల్పాహారం అందిస్తున్నారు. విజయ దశమి తరువాత పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు చేస్తామని అధికారులు ప్రకటించినా.. ఆ దిశగా చర్యలు లేవు.

ముక్టాపూర్‌లో ఉదయం పది గంటలకు అల్పాహారం కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు

అరకొరగా పంపిణీ

  • నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో దసరా తరువాత అన్ని పాఠశాలల్లో ఉదయం అల్పహారం అమలు చేశారు. ఎన్నికలు రావడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతానికి 65 శాతం పాఠశాలలో మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఉప్మా, అటుకులతో నెట్టుకొస్తున్నారు. పాత బిల్లులే రావడం లేదు. ఈ బిల్లులు వస్తాయో లేదోనని వంట ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
  • జహీరాబాద్‌ పరిధిలోని అల్లీపూర్‌ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశీలించగా.. నాణ్యతగా లేకపోవడంతో తినలేకపోతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
  • నాగల్‌గిద్ద మండలం ముక్టాపూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. ఉదయం 10 గంటలైనా విద్యార్థులు ఎదురు చూస్తూ కనిపించారు. అక్కడున్న వంట గదికి తాళం వేసి ఉంది. ఈ విషయమై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ అడగ్గా.. ఆలస్యమైనా రోజూ పెడుతున్నట్లు పేర్కొన్నారు. మెనూ పాటించడం లేదన్నారు.
  • సిర్గాపూర్‌ మండలం ఖాజపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9.30 గంటల వరకు అల్పాహారం వడ్డించలేదు. బోరు పాడవడంతో నీటి కొరత వల్ల ఆలస్యమైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లిన తరువాత ప్రారంభిచండంతో తరగతులకు ఇబ్బందిగా మారింది.

జిల్లాలో ఇలా..

  • మొత్తం పాఠశాలలు: 1248
  • అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందుతున్నవి: 672
  • వంట గ్రూపులతో అమలవుతున్నవి: 576

ఉన్నతాధికారులకు నివేదిస్తాం
- వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

జిల్లాలోని చాలా పాఠశాలల్లో అల్పాహారం అమలు కావడం లేదు. అక్షయ పాత్ర ద్వారా భోజనం అందిస్తున్న చోట్ల అల్పాహారం పంపిణీ లేదు. ఇతర చోట్ల కూడా కొన్ని సమస్యలున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఇచ్చిన మెనూను తప్పకుండా అమలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు