logo

దామోదర తీన్‌మార్‌

మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 08 Dec 2023 06:32 IST

కలిసొచ్చిన అనుభవం.. వరించిన మంత్రి పదవి
అన్ని రంగాల అభివృద్ధిపై జిల్లా ప్రజల ఆశలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట

మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న తొలి నేత దామోదర కావడం గమనార్హం. ఆయన విద్యావేత్త. ఉమ్మడి జిల్లాపై మంచి పట్టుంది. గతంలో ఉప ముఖ్యమంత్రి, రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టిన అనుభవం ఉంది. తాజాగా మరోమారు అమాత్య యోగం దక్కడంతో జిల్లా మరింత అభివృద్ధి చెందేలా దామోదర కృషి చేయాలని ప్రజలు ఆశిస్తున్న నేపథ్యంలో కథనం.

విజయానికి బాటలిలా..

అందోలు నుంచి గత రెండు పర్యాయాలు ఓటమి చెందడంతో ఈసారి గెలుపును సవాలుగా తీసుకున్నారు దామోదర. కుమార్తె త్రిష గడప గడపకు త్రిషమ్మ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. భారాస ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంతో పాటు.. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. యువ గర్జన, విద్యార్థి-నిరుద్యోగ గర్జన, సభలు నిర్వహించారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని దామోదర రాజనర్సింహ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార సభకు రాహుల్‌ గాంధీ సైతం రావడం ఆయన విజయానికి దోహదపడింది.

ఉమ్మడి జిల్లాకు పెద్దన్న పాత్ర

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అందోలు నియోజకవర్గానికి చెందిన దామోదర పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్‌లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 7 చోట్ల భారాస విజయం సాధించింది. అందోలు, నారాయణఖేడ్‌, మెదక్‌ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుందరూ ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం బాధ్యతలు దామోదరపైనే ఉంటాయని చెప్పవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా వాటిల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఈయనే కృషి చేయాల్సి ఉంటుంది.

కుమార్తె త్రిషతో కలిసి ప్రచారం చేస్తూ..

ఐఏఎస్‌ అవుదామనుకొని.. రాజకీయాల్లోకి..

అందోలు ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొంది మంత్రి బాధ్యతలు నిర్వహించిన సి.రాజనర్సింహ 1988లో పదవిలో కొనసాగుతూనే అనారోగ్యంతో మరణించారు. ఆయన తనయుడు దామోదర రాజనర్సింహ అప్పట్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం 1989లో దామోదరకే టికెట్‌ ఖరారు చేసి అందోలు బరిలో నిలుపగా ఆయన విజయం సాధించారు. 1994, 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో దామోదర ఓటమి పాలవ్వగా.. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రిగా, మార్కెటింగ్‌ శాఖ, విద్యాశాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన తాజాగా జరిగిన శాసనసభ పోరులో 28 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో భారాస అభ్యర్థి క్రాంతికిరణ్‌పై విజయం సాధించారు.


గతంలో తనమైన ముద్ర

అందోలు  నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి 40వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో 2003లో 102 రోజులు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సింగూరు కాలువలకు రూ.89.98 కోట్లు మంజూరు చేయించారు. పనులు పూర్తయ్యేలా చొరవచూపారు. విద్యాభివృద్ధికి చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద 165 ఎకరాల్లో జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటులో దామోదర కీలకపాత్ర పోషించారు. జోగిపేటలో మహిళా డిగ్రీకళాశాల, పీజీ కళాశాల, జనరల్‌, మహిళా పాలిటెక్నిక్‌లు, అందోలు మండలంలోని సంగుపేటకు మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలను మంజూరు చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని