logo

పథకాల అమలులో పారదర్శకత

విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి.

Published : 08 Dec 2023 02:31 IST

యూడైస్‌లో పక్కాగా వివరాల నమోదు

తరగతి గదిలో విద్యార్థులు

న్యూస్‌టుడే, మెదక్‌: విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి. ఆయా వాటి అమలుకు యూ డైస్‌ దోహదపడుతుంది. ఇందులోని సమాచారం ఆధారంగానే బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. అయితే పలు అవకతవకల వల్ల కచ్చితమైన సమాచారం లేక నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో యూడైస్‌+ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో నమోదయ్యే వివరాల ఆధారంగానే నిధులు మంజూరు చేయనున్నారు.

పాఠశాలల నిర్వహణకు నిధుల మంజూరులో పారదర్శకత పాటించేందుకు యూడైస్‌+ వెబ్‌సైట్‌ దోహదపడుతుంది. ఎప్పటికప్పుడు ఇందులో జరిగే మార్పులు, చేర్పులపై పాఠశాలల నిర్వాహకులకు విద్యాశాఖ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇటీవల ఎంఈవోలు, హెచ్‌ఎంలకు శిక్షణ మొదలైంది. వెబ్‌సైట్‌లో పొందుపర్చే సమాచారం ఆధారంగా మన ఊరు -  మనబడి, పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం నెలకొంది.

14వ తేదీలోపు..

సదరు వెబ్‌సైట్‌లో వివరాలను ఈ నెల 14వ తేదీలోపు నమోదు పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్దేశిచింది. ఇందుకు అనుగుణంగా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం వివరాల నమోదుకు కసరత్తు జరుగుతోంది. యూడైస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌)లో పాఠశాల, కళాశాల (జూనియర్‌) స్థాయి సర్వ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంటారు.

కూచన్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది


అదనపు సమాచారంతో..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, కస్తూర్బాలు, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను గతంలోనే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీనికి మరిన్ని వివరాలు జోడించి కొన్ని మార్పులు చేయనున్నారు. తరగతి గదులు, శౌచాలయాలు, తాగునీరు, మౌలిక వసతుల సమాచార వివరాలు నమోదు చేయనుండటంతో నిధుల విడుదలకు ఉపయుక్తంగా ఉండనుంది. ఆయా కొత్త అంశాలపై ఎంఈవోలు, సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఇతర ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

మూడంచెల విధానంలో..

యూడైస్‌+లో నమోదైన వివరాలను మూడంచెల విధానంలో పరిశీలిస్తారు. ఈనెల 14లోపు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వివరాలు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆయా వివరాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అనే విషయాలను స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పరిశీలించి ఎంఈవోలకు నివేదిక అందిస్తారు. అనంతరం 25 శాతం పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి 10 శాతం పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు.

కొత్తగా ‘పెన్‌’ కేటాయింపు

ఈసారి కొత్తగా ఏక్‌ భారత్‌ -శ్రేష్ఠ భారత్‌ కార్యక్రమ ఉద్దేశం వివరించనున్నారు. పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మరింత నాణ్యమన విద్యను అమలు చేయనున్నారు. కోర్సుల విశేషాలను, అనుబంధ వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వెబ్‌సైట్‌లో నమోదైన ప్రతి విద్యార్థికి పెన్‌(పర్మినెంట్‌ ఎడ్యుకేష్‌ నంబరు) కేటాయిస్తారు. అన్ని రకాల పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశం మొదలు, ఉన్నత విద్యను పూర్తి చేసే వరకు ఈ నంబరే విద్యార్థికి కీలకం. ఇప్పటికే జిల్లాలో 1.20 లక్షల మందికి నంబరును కేటాయించారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.


పకడ్బందీగా వివరాలు నమోదు
రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

యూడైస్‌+లో పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు పకడ్బందీగా నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా శిక్షణలు పూర్తి చేశాం. నిర్ణీత గడువులోగా వివరాలను నమోదు పూర్తి చేస్తాం. ఈ విధానంలో ఒకే దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. తద్వారా సులభంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని