logo

ప్రమాణ శ్రీకారం

త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్‌... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్‌బాగ్‌ పరిసరాలు గురువారం సందడిగా మారాయి.

Updated : 08 Dec 2023 06:33 IST

జన సంద్రమైన ఎల్బీ స్టేడియం పరిసరాలు
భాగ్యనగరంలో రెపరెపలాడిన కాంగ్రెస్‌ జెండాలు
పండగ వాతావరణంలో ప్రజా ప్రభుత్వ బాధ్యతల స్వీకారం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ, బషీర్‌బాగ్‌ : త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్‌... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్‌బాగ్‌ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం పండగ వాతావరణంలో జరిగింది.   ఉదయం నుంచే స్టేడియానికి పార్టీ శ్రేణుల రాక ప్రారంభమైంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు  స్టేడియం, బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రీ, కంట్రోల్‌ రూం, పరిశ్రమ భవన్‌, పబ్లిక్‌గార్డెన్స్‌ ప్రాంతాలు జన సందోహంతో నిండిపోయాయి.  బ్యారికేడ్లు ఏర్పాటు చేసి దూరంలోనే వాహనాలను నియంత్రించడంతో అక్కడి నుంచి కాలినడకన చేరుకున్నారు. కాంగ్రెస్‌ అధినేతలు తరలివస్తున్న సందర్భంగా రోడ్డు పక్కన నిలబడి స్వాగతం పలికారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని చాటారు.

ప్రత్యక్ష ప్రసారాలు.. ఎల్‌ఈడీ తెరలు

స్టేడియం వెలుపల బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌, ఆలియా స్కూలు, పరిశ్రమ్‌ భవన్‌ తదితర ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేశారు. లోపలికి వెళ్లే వీలులేక బయటే ఉండిపోయిన కార్యకర్తలు ఇక్కడి నుంచే వీక్షించారు. సాంస్కృతిక నృత్యాలు, డప్పుల దరువులు, మేళతాళాలు, బతుకమ్మలతో కళాకారులు అశేష జనానికి స్వాగతం పలికారు.

సచివాలయం... ట్యాంక్‌బండ్‌ వద్ద సందడి..

రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్‌  శ్రేణులతో సచివాలయం, ట్యాంక్‌ బండ్‌ రోడ్‌లో సందడి  నెలకొంది. అంబేడ్కర్‌, బుద్ధుడి విగ్రహాల వద్ద, సచివాలయం ముందు, అమరవీరుల స్తూపం వద్ద ఫొటోలు దిగుతూ సంతోష పడ్డారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కులను తిలకించారు.


ఉచిత నీరు.. మరింత!

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి సరఫరా పరిమాణం పెంపుపై జలమండలి లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిని మరో 5 వేల లీటర్లకు పెంచి...25 వేల లీటర్లు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జలమండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరిమాణం పెంపుతో ఎంతమందికి లబ్ధిచేకూరుతుందనే విషయమై వివరాలు సేకరిస్తున్నారు. రెండేళ్ల క్రితం బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం గ్రేటర్‌లో ఈ హామీ ఇచ్చింది. గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 12 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉండగా...ఇప్పటివరకు ఇందులో 6 లక్షల మంది వినియోగించుకుంటున్నారు.  ఈ పథకం ద్వారా రూ.40కోట్ల వరకు జలమండలి రాయితీ కింద భరిస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల హామీల్లో భాగంగా అదనంగా 5 వేల లీటర్లకు పెంచడంతో మరో రూ.10 కోట్ల వరకు ఆదాయంలో కోత పడనుంది.  అయితే ఈ పథకంపై జలమండలి రూ.వేయి కోట్ల పైనే భరించగా...అందులో సగం కూడా గత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో నిధుల కొరత తప్పడం లేదు. ఈ విషయాన్ని అప్పట్లో ఉన్నతాధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా వెనకడుగు వేయడంతో బకాయిలు పేరుకు పోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన దృష్ట్యా ఈ వివరాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.


ఆ భాగ్యం దక్కలేదు..

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర మంత్రివర్గంలో భాగ్యనగరం పరిధిలోని మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్‌ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి చోటు దక్కుతుందని అంతా భావించారు. గురువారం జరిగిన మంత్రివర్గంలో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకోలేదు. త్వరలో జరిగే విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.  

హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవలేదు. రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల గెలిచారు. ఈ ముగ్గురిలో షాద్‌నగర్‌ నుంచి వీర్లపల్లి శంకర్‌, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి విజయం సాధించారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఇది మూడోసారి. పార్టీ సీనియర్‌గా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించాల్సి ఉంది. గురువారం ఏర్పాటైన మంత్రివర్గంలో మల్‌రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలుపుకొంటే నలుగురు ఉన్నారు. ఈనేపథ్యంలోనే మల్‌రెడ్డికి స్థానం లభించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మైనార్టీ నేతను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని