logo

విద్యుత్తు ఉపకేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేట పట్టణంలోని 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలివీ.. సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో 220కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో 100ఎంఈఏ సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.

Published : 22 Feb 2024 01:42 IST

రూ.2 కోట్లకు పైనే నష్టం

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట పట్టణంలోని 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలివీ.. సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో 220కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో 100ఎంఈఏ సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి పొగ వ్యాపించింది. గమనించిన విద్యుత్తు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో అయిల్‌ ఉండటంతో మంటలు ఎంతకూ అదుపులోకి రాలేదు. దీంతో దుబ్బాకకు చెందిన మరో అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. మూడు గంటలకు పైనే శ్రమించగా మంటలను ఆర్పివేశారు. విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మహేష్‌కుమార్‌, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ అనూరాధ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కారణాలపై ఆరా తీశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సాయంత్రం 6.55 గంటలకు ఉపకేంద్రంలో విద్యుత్తు ట్రిప్‌ అయిందని, సిబ్బంది గమనిస్తుండగానే మంటలు చేలరేగాయన్నారు. సిబ్బంది అప్రమత్తమై మిగతా విభాగాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారన్నారు. సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా..

జిల్లాకేంద్రంలో అగ్నిప్రమాదం కారణంగా సిద్దిపేటతో పాటు అర్బన్‌, గ్రామీణం, నారాయణరావుపేట, లక్ష్మీదేవిపల్లి ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలు, చిన్నకోడూరులోని 5 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఘటనా స్థలిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని