logo

రక్తమోడిన దారులు

సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కన్నతల్లి కళ్లెదుటే చిన్నారి.. పుస్తకాలు, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఇద్దరు యువకులు.. వాహనాన్ని దాటే క్రమంలో మరొకరు మృత్యువాత పడ్డారు.

Published : 22 Feb 2024 01:50 IST

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కన్నతల్లి కళ్లెదుటే చిన్నారి.. పుస్తకాలు, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఇద్దరు యువకులు.. వాహనాన్ని దాటే క్రమంలో మరొకరు మృత్యువాత పడ్డారు.


వాహనంపై ఎక్కించుకొని..

అరుణ్‌, అయాన్‌

గజ్వేల్‌ గ్రామీణ: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-సంగాపూర్‌ దారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినికి ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు బుధవారం మృతి చెందారు. సీఐ సైదా తెలిపిన వివరాలు.. గజ్వేల్‌కు చెందిన అయాన్‌ (20) పట్టణంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఉదయం విధుల్లోకి వచ్చిన అయాన్‌.. వాహనంపై డబ్బాలో మంచినీళ్లు తెచ్చేందుకు బయలుదేరాడు. దౌల్తాబాద్‌ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన గడ్డమీది అరుణ్‌ (20).. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారానికి చెందిన నక్కని దిలీప్‌లు గజ్వేల్‌ వసతి గృహంలో ఉంటూ బాలుర డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరికి నోటు పుస్తకాలు అవసరం ఉండటంతో రహదారిపైకి వచ్చి అయాన్‌ను లిఫ్ట్‌ అడుగగా ఎక్కించుకొని వస్తుండగా బాలికల విద్యా సౌధం సమీపంలో విభాగినికి ఢీకొట్టింది. అరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా అయాన్‌ చనిపోయాడు. దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గడ్డమీది శ్రీనివాస్‌ దంపతుల ఇద్దరు కుమారుల్లో అరుణ్‌ చిన్నవాడు. తల్లిదండ్రులు, పెద్దకుమారుడు హైదరాబాద్‌కు జీవనోపాధికి వలస వెళ్లారు.


తల్లి కళ్ల ముందే..

తలపాక రిత్విక్‌

కొండపాక గ్రామీణం: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌ ముందు రాజీవ్‌ రహదారిపై అమ్మ చూస్తుండగానే బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై పి.శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలపాక లావణ్య ఇద్దరు పిల్లలు రిత్విక్‌, దాసులతో కలసి కుకునూరుపల్లి మండలం మాత్‌పల్లిలో బంధువుల ఇంటికి ప్రతిష్ఠోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలేదేరింది. రహదారిని దాటుతుండగా ఒక్కసారిగా పెద్దకుమారుడు తలపాక రిత్విక్‌(6) ముందుకు పరుగెత్తాడు. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో శరీరం నుజ్జునుజ్జుయి చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


లారీని దాటే క్రమంలో..

జహీరాబాద్‌ అర్బన్‌: ముందుగా వెళ్తున్న లారీని దాటే క్రమంలో కారుతో ఢీకొట్టడంతో బీదర్‌ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు జహీరాబాద్‌ పట్టణ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. బైపాస్‌ రోడ్డులోని అల్గోల్‌ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బీదర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న బీదర్‌ పట్టణంలోని నౌబాద్‌కు చెందిన శివకుమార్‌(37) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు