logo

161 హైవేపై.. జర జాగ్రత్త

రహదారులు ప్రగతికి అద్దం లాంటివని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అవే దారుల నిర్మాణాల్లో లోపాలు.. అసంపూర్తి పనులతో ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్నాయి.

Published : 22 Feb 2024 02:03 IST

సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారిలో తరచూ ప్రమాదాలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది, జోగిపేట టౌన్‌, నారాయణఖేడ్‌, కల్హేర్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం

జంబికుంటలో సర్వీసు రోడ్డు

హదారులు ప్రగతికి అద్దం లాంటివని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అవే దారుల నిర్మాణాల్లో లోపాలు.. అసంపూర్తి పనులతో ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి- నాందేడ్‌- అకోలా 161వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది. లోపభూయిష్టంగా పనులు చేపట్టారు. జిల్లా పరిధిలోని ఈ రహదారిపై మూడు నెలల వ్యవధిలో సుమారు 60 ప్రమాదాలు జరిగాయి. 70 మంది గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి వద్ద వంతెన పనులు, చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో విస్తరణ పనులు మినహా మిగిలిన మూడు ప్యాకెజీలు గతంలోనే పూర్తయ్యాయి. రూ.3,170 కోట్లతో 140 కి.మీ. మేర చేపట్టారు. సర్వీసు రోడ్లను గుర్తించేలా సూచికలు లేవు. ఒకసారి పైవంతెన పైకి వాహనంతో వెళితే సుమారు 10 కిలోమీటర్లు వెళ్లి వెనక్కి రావాల్సి వస్తోంది. యూటర్న్‌లకు బదులు అండర్‌పాస్‌లు నిర్మిస్తే ప్రమాదరహితంగా ఉండేది. బొడ్మట్‌పల్లి నుంచి ఒక వైపు దిగువ వంతెన నిర్మించక పోవడంతో పాట్లు తప్పడం లేదు. నారాయణఖేడ్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి  బొడ్మట్‌పల్లికి రెండు కి.మీ.దూరంలో ముప్పారం వద్ద మాత్రం దిగువ వంతెన ఉంది.

నిజాంపేట వంతెన

పెద్దశంకరంపేట మండలం కోలపల్లి నుంచి జంబికుంట గ్రామ శివారు వరకు 5 కిలోమీటర్లు ఉంది. కోలపల్లిలో గతంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద విభాగినులను తొలగించ లేదు. ప్రమాద కారకాలవుతున్నాయి.  రాఘవాని తండా నుంచి పెద్దశంకరంపేట వరకు సర్వీసు రోడ్డులో వీధిదీపాలులేక రాత్రి పూట చీకటిగా ఉంటోంది. కమలాపురంలో అండర్‌ బ్రిడ్జి నిర్మించాలి.


బాచేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పరిస్థితి

కల్హేర్‌ మండలంలో బాచేపల్లి గ్రామానికి అనుకుని అండర్‌ పాస్‌తో బల్కంచెల్క తండాకు దారి లేదు. అపసవ్య దిశలో రాకపోకలు సాగిస్తున్నారు. మహదేవ్‌పల్లిలో అండర్‌ పాస్‌ ఇవ్వాల్సి ఉంది. అపసవ్య దిశలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెలగనూర్‌, బ్రాహ్మణపల్లి వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. దేవునిపల్లి, ఖానాపూర్‌-బి గ్రామాలకు అండర్‌పాస్‌ లేదు. ఇక్కడ అదే పరిస్థితి.


రాంపూర్‌ వద్ద రోదిస్తున్న బంధువులు

అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌, ముస్లాపూర్‌ , చిల్వేర, రాంపూర్‌ మీదుగా రహదారి సాగుతోంది. ముస్లాపూర్‌ వాసులు అపసవ్య దిశలో వెళుతుంటారు. రాంపూర్‌, అల్లాదుర్గం, చిల్వేర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


కంది మండలం మామిడిపల్లి వంతెన వద్ద నుంచి జోగిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు వైపు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. వంతెన పనులు పూర్తి కాకపోవడంతో ఏ వాహనం ఎటువైపు వెళ్తోందో అంతుచిక్కడం లేదు.


అందోల్‌ మండలం సంగుపేటలో అండర్‌పాస్‌ లేదు. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. రాంసాన్‌పల్లి, ఎర్రారం, నేరడిగుంటలో యూటర్న్‌ తీసుకుని ఎదురుగా రావడం వల్ల ప్రమాదాలవుతున్నాయి. రాంసాన్‌పల్లిలో గత నెలలో ఓ పాప మృతి చెందింది.


ఎన్‌హెచ్‌ అధికారులతో చర్చించి పరిష్కరిస్తాం
రూపేశ్‌, ఎస్పీ, సంగారెడ్డి

161వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. కారణాలపై విశ్లేషిస్తాం. బ్లాక్‌స్పాట్లు గుర్తించి.. జాతీయ రహదారి సంస్థ విభాగం అధికారులతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని