logo

టీ ఫైబర్‌ సేవలెప్పుడు?

ప్రతీ పంచాయతీకి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన టీఫైబర్‌ కార్యక్రమం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కేబుల్‌ వైర్లు వేసి పరికరాలు బిగించినెలలు గడుస్తున్నా అంతర్జాల కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు.

Published : 22 Feb 2024 02:06 IST

పరికరాలు అలంకారప్రాయం

పంచాయతీలో ఏర్పాటు చేసిన పరికరం

న్యూస్‌టుడే, అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం): ప్రతీ పంచాయతీకి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన టీఫైబర్‌ కార్యక్రమం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కేబుల్‌ వైర్లు వేసి పరికరాలు బిగించినెలలు గడుస్తున్నా అంతర్జాల కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో పరికరాలన్నీ అలంకారప్రాయంగా మారాయి.

టీ ఫైబర్‌ ద్వారా పంచాయతీలకు, ఆ తర్వాత ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చి అంతర్జాల సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని రోడ్లను తవ్వి ఫైబర్‌ కేబుల్‌ వైర్లు వేశారు. కార్యాలయాల్లో అంతర్జాలానికి సంబంధించిన పరికరాలు బిగించారు. విద్యుత్తు సదుపాయం కోసం సౌరఫలకాలు ఏర్పాటు చేసి పరికరాలు నడిచేలా అనుసంధానించారు. ఆ తర్వాత ఎంపీడీవో ఆఫీసులో పరికరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు అనుసంధానించారు. వీటి ద్వారా ఇంటర్నెట్‌ వస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు టెస్టింగ్‌ సైతం నిర్వహించారు. ఆ తర్వాత వదిలేశారు. ఇప్పటివరకు కనెక్షన్లు ఇవ్వకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలోని చాలా మండలాల్లో అంతర్జాల సేవలు అందడం లేదు.

చరవాణి నుంచి.. నెట్‌ సౌకర్యం లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. చరవాణుల ద్వారా వైఫై కనెక్ట్‌ చేసుకుని అంతర్జాల సేవలు పొందుతున్నారు. దీని ద్వారా వచ్చే నెట్‌ వేగం తక్కువగా ఉంటోందని, సిగ్నల్స్‌ సరిగా అందడం లేదని వాపోతున్నారు. ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ కావడం లేదని కంప్యూటర్‌ ఆపరేటర్లు తెలిపారు.


పనులు పూర్తి కాలేదు
-రాజేందర్‌, ఫైబర్‌నెట్‌ ప్రతినిధి

టీ ఫైబర్‌ పనులు ఇంకా పూర్తి కాలేదు. రౌటర్లు బిగించాల్సి ఉంది. రోడ్డు పనులతో అక్కడక్కడ కేబుల్‌వైర్లు ధ్వంసమయ్యాయి.


ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
-దేవకీదేవి, డీపీవో

జిల్లాలోని దాదాపు అన్నీ పంచాయతీల్లో టీఫైబర్‌ కార్యక్రమం కింద వ్యవస్థ ఏర్పాటు చేశారు. అనేక చోట్ల అంతర్జాల సేవలు అనుసంధానం అయినట్లు తెలుస్తోంది. గతంలో కావాల్సిన స్థలం కావాలంటే కేటాయించాం. ఇంకా మాకు అప్పగించలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని