logo

మొక్కులు తీరి.. మేడారం బయలుదేరి

వన దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. కోరిన కోర్కెలు తీరితే రెండేళ్లకోసారి జరిగే జాతరలో నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తామని మొక్కుకుంటారు.

Published : 22 Feb 2024 02:13 IST

హుస్నాబాద్‌లో బంగారం తూకం వేస్తున్న భక్తులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: వన దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. కోరిన కోర్కెలు తీరితే రెండేళ్లకోసారి జరిగే జాతరలో నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తామని మొక్కుకుంటారు. తీరిన భక్తులు నిలువెత్తు బంగారం తూకాలు చేయించిన తర్వాతే మేడారానికి, స్థానికంగా జరిగే ఉత్సవాలకు వెళ్తారు. ఈ క్రమంలో బుధవారం హుస్నాబాద్‌ ప్రధాన రహదారిలో ఎక్కడ చూసిన నిలువెత్తు తూకాలే కనిపించాయి. భక్తులు మేడారం వెళ్లడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పల్లెల నుంచి ముల్లె మూటలతో హుస్నాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు తరలివస్తున్నారు.

గద్దెకు చేరిన సారలమ్మ.. నంగునూరు,  న్యూస్‌టుడే: అక్కెనపల్లిలో బుధవారం సాయంత్రం డప్పు చప్పుళ్లతో, శివ సత్తుల పూనకాల మధ్య సారలమ్మను గద్దెకు చేర్చారు. గ్రామంలోని దాసరి సింగరయ్య ఇంటి నుంచి ఊరేగింపుగా ఊరి పొలిమేరలో ఉన్న గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చారు. గురువారం భక్తులు మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేశారు.

పొట్లపల్లి: సారలమ్మను తీసుకొస్తున్న కోయపూజారులు

హుస్నాబాద్‌ గ్రామీణం: పొట్లపల్లి, గోవర్ధనగిరిలో జాతర ఘనంగా ప్రారంభమైంది. పొట్లపల్లిలో ఎల్లమ్మగుట్ట నుంచి, గోవర్ధనగిరిలో సంజీవరాయనిగుట్ట, హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు గట్టు నుంచి  సారలమ్మను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు.


నియోజకవర్గంలో మంత్రి పర్యటన నేడు

హుస్నాబాద్‌, కోహెడ గ్రామీణం: హుస్నాబాద్‌ నియోజకవర్గంలో గురువారం జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఎల్కతుర్తి మండలం దామెర, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌, ఎర్రబెల్లి, కొత్తకొండ జాతర ఉత్సవాల్లో పాల్గొంటారు. తర్వాత హుస్నాబాద్‌ పట్టణం, పొట్లపల్లి, కోహెడ మండలం పరివేద, వింజపల్లి, తంగెళ్లపల్లిలో జరిగే జాతరకు హాజరవుతారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని