logo

తనిఖీ హుళక్కి

ప్రభుత్వ ఆదాయంలో రవాణా శాఖది కీలక పాత్ర. ఈ శాఖ నుంచి ప్రతి నెల రూ.కోట్లలో ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో ఉద్యోగులు, సిబ్బంది ఖాళీలు, సర్కారు ఆదాయానికి భారీగా గండి పడేలా చేస్తున్నాయి.

Published : 22 Feb 2024 02:15 IST

తెలంగాణ-సరిహద్దులోని మాడ్గి అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టు

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ ఆదాయంలో రవాణా శాఖది కీలక పాత్ర. ఈ శాఖ నుంచి ప్రతి నెల రూ.కోట్లలో ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో ఉద్యోగులు, సిబ్బంది ఖాళీలు, సర్కారు ఆదాయానికి భారీగా గండి పడేలా చేస్తున్నాయి. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి శివారులో హైదరాబాద్‌-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు ఉద్యోగుల ఖాళీలతో కొట్టుమిట్టాడుతోంది. వాహన తనిఖీల్లో ప్రధానమైన ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ చేయడంతో, కానిస్టేబుల్‌, హోంగార్డులే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ ద్వారంగా పేరొందిన మాడ్గి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు రవాణా పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి నెలా నిర్దేశించిన రూ.4 కోట్ల ఆదాయానికి మించి రూ.5 కోట్లకు పైచిలుకు వసూళ్లతో ఖజానాకు వెన్నుదన్నుగా నిలిచేది.

ప్రస్తుతం ఒకే ఒక్కడు..: మాడ్గి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో ముగ్గురు ఎంవీఐలు, తొమ్మిది మంది ఏఎంవీఐలు విధులు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి, పగలు వంతుల వారీగా కానిస్టేబుల్‌, హోంగార్డుల సహకారంతో విధులు నిర్వహిస్తున్నారు. వీరు రాష్ట్రంలోకి రాకపోకలు సాగించే వాహనాల నుంచి రవాణా పన్ను, వాహన ప్రవేశానికి అనుమతులు, రవాణా చేస్తున్న సరుకుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుంటారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇటీవల మూడేళ్లు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కలిగించడంతో కేంద్రం ఖాళీ అయ్యింది. చెక్‌పోస్టుకు బదిలీ చేసిన ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధుల్లో చేరకపోవడం, మరోప్రాంతానికి పైరవీలు సాగిస్తున్నారు. దీంతో ఒకే ఒక ఎంవీఐ మాత్రమే విధుల్లో చేరారు.

ఆదాయానికి గండి..: హైదరాబాద్‌-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై నిమిషం వ్యవధి ఖాళీ లేకుండా వాహన రాకపోకలు సాగుతుంటాయి. ఏఎంవీఐలు లేకపోవడంతో కానిస్టేబుళ్లు, హోంగార్డులు చేయాల్సి వస్తోంది. ఫలితంగా వాహనాలు పూర్తి స్థాయిలో నిలపకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గత జనవరి నుంచి ఉద్యోగులు బదిలీ అవుతున్నా నిర్దేశించిన ఆదాయం సమకూరింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. బదిలీల్లో కేటాయించిన ఎంవీఐలు, ఏఎంవీఐలు త్వరతగతిన ఉద్యోగాల్లో చేరేలా ఉన్నతాధికారులు చూడాల్సిన అవసరముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని