logo

పురపాలికకు రూ.5.13 లక్షల ఆదాయం

మెదక్‌ పురపాలికకు సంబంధించిన వాణిజ్య దుకాణాలను వేలం వేయగా అద్దెల ద్వారా ప్రతినెలా రూ.5.13 లక్షల ఆదాయం రానుంది.

Published : 22 Feb 2024 02:17 IST

ధ్రువపత్రం అందజేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: మెదక్‌ పురపాలికకు సంబంధించిన వాణిజ్య దుకాణాలను వేలం వేయగా అద్దెల ద్వారా ప్రతినెలా రూ.5.13 లక్షల ఆదాయం రానుంది. బుధవారం పట్టణంలోని పుర కార్యాలయంలో జిల్లా మైనింగ్‌ ఏడీ జయరాజ్‌, జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, పుర కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో 17 దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మొత్తం 58 మంది దరఖాస్తుదారులు పాల్గొనగా, 17 మంది దుకాణాలను దక్కించుకున్నారు. ఇందులో అత్యధికంగా 9వ దుకాణానికి రూ.55,100 రాగా, అత్యల్పంగా 5వ దుకాణానికి రూ.6800 వచ్చాయి. గతంలో మొత్తం 17 దుకాణాలకు నెలకు అద్దె రూ.83 వేలు రాగా.. ప్రస్తుతం నిర్వహించిన వేలం ప్రకారం ప్రతినెలా రూ.5.13 లక్షలు అద్దె రూపంలో పురపాలికకు ఆదాయం సమకూరనుంది.  

ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే రోహిత్‌రావు

మెదక్‌ అర్బన్‌: రాష్ట్రంలోనే మెదక్‌ పురపాలికను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 వాణిజ్య దుకాణాల ద్వారా పురపాలికకు నెలకు రూ.5,13,400 ఆదాయం రావడం హర్షణీయమన్నారు. ఈ మొత్తాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగించేలా చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని