logo

హడావుడిగా చేపట్టి.. అర్ధాంతరంగా ఆపేసి

ఎనిమిది గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు మంజూరు కావడంతో గతేడాది శంకుస్థాపన చేశారు. ఎన్నికల అనంతరం పనులను మొదలుపెట్టారు.

Published : 22 Feb 2024 02:20 IST

మెదక్‌లోని దాయర రహదారి విస్తరణ పనుల తీరిది

ఓ ఇంటి ముందు తవ్వడంతో లోపలికి వెళ్లేందుకు దారి లేక

న్యూస్‌టుడే-మెదక్‌: ఎనిమిది గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు మంజూరు కావడంతో గతేడాది శంకుస్థాపన చేశారు. ఎన్నికల అనంతరం పనులను మొదలుపెట్టారు. హడావుడిగా చేపట్టి.. అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ జోక్యం కారణంగానే అర్ధాంతరంగా పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం...

ఇరుకైన దారి.. మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా నుంచి దాయర శివారులో ఉన్న గోసంద్రం, పిట్లం చెరువుల వరకు ఉన్న రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. హవేలిఘనపూర్‌ మండలంలోని ముత్తాయికోట, కూచన్‌పల్లి, దేవునికూచన్‌పల్లి, తొగిట, ముత్తాయిపల్లి, ఫరీద్‌పూర్‌, సర్ధన, జక్కన్నపేట గ్రామాలకు ఈ మార్గం నుంచే వెళ్లాలి. ఆయా గ్రామాల ప్రజలు ఎక్కువగా చమాన్‌ చౌరస్తా మీదుగా రాకపోకలు కొనసాగిస్తారు. సర్ధనకు వెళ్లే ఆర్టీసీ బస్సు సైతం ఈ దారి నుంచే వెళ్తుంది. రాందాస్‌ చౌరస్తా నుంచి చమాన్‌ మీదుగా ఆవారబస్తీ వరకు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఈ క్రమంలో రహదారి విస్తరణకు గత ప్రభుత్వ హయాంలో రూ.7.80 కోట్లు మంజూరయ్యాయి. అక్టోబర్‌లో పనులకు శంకుస్థాపన చేపట్టారు.

ఇష్టారీతిన పనులు... టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు పనులను ఇష్టారీతిగా చేపడుతున్నారు. రహదారి విస్తరణతో పాటు ఇరువైపుల మురుగుకాలువ, మధ్యలో విభాగిని, వీధి దీపాల బిగింపు పనులు చేపట్టాలి. ముందుగా సినీమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద నుంచి దాయర వెళ్లే శ్మశానవాటిక సమీపం వరకు ఇరువైపుల మురుగుకాలువ పనులను చేపట్టారు. కొన్నిచోట్లనే పైపులు వేసి మ్యాన్‌హోల్‌ బిగించారు. ఇళ్ల ముందు గోతులు తవ్వి వదిలేశారు. మ్యాన్‌హోల్‌ను సరిగా బిగించలేదు. హడావుడిగా పనులు ప్రారంభించిన గుత్తేదారు ప్రస్తుతం నిలిపివేయడం గమనార్హం. రాజకీయ జోక్యం వల్లే ఆగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీమ్యాక్స్‌ థియేటర్‌ సమీపంలో గోతులను తవ్వి ఒకచోట పైపులు వేయగా, మరోచోట అలాగే వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.

విస్తరించకుండానే... రాందాస్‌ చౌరస్తా నుంచి గోసంద్రం, పిట్లం చెరువుల వరకు ఉన్న రహదారిని 50 అడుగులు విస్తరించాలి. 16,17,20,22,23 వార్డుల పరిధిలో విస్తరణ కోసం ఆయా దుకాణాలు, గృహాలకు మార్కింగ్‌ వేశారు. రాందాస్‌ చౌరస్తా వద్ద దుకాణాల మెట్లను, చమాన్‌లో ఉన్న హోటళ్లను, ఆయా దుకాణాల డబ్బాలను బల్దియా అధికారులు తొలగించారు. చమాన్‌ నుంచి ఆవారబస్తీ వరకు రహదారి చాలా ఇరుకుగా ఉంటుంది. విస్తరణకు అడ్డుగా ఉన్న కట్టడాలను కూల్చివేయక ముందే మురుగుకాలువ పనులను చేపడుతుండటం గమనార్హం. మురుగుకాలువ పనులు పూర్తయ్యాక విస్తరణ కోసం కట్టడాలను కూల్చివేస్తామని మున్సిపల్‌ టీపీవో భూపతి తెలిపారు.


కూల్చివేయాలని లేఖ రాశాం
రియాజ్‌, ర.భ శాఖ ఏఈ

రహదారి విస్తరణ విస్తరణ చేపట్టి, కట్టడాలను కూల్చివేయాలని మున్సిపల్‌ అధికారులకు లేఖ రాశాం. గుత్తేదారు అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. ఈ విషయమై సంప్రదిస్తే వచ్చి పనులు చేస్తానని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని