logo

సెలయేరులా సాగుతూ..

హల్దీవాగు రైతులకు ఎంతో మేలు చేస్తోంది. మండుటెండల్లోనూ పొలాలు పచ్చగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ వాగు నుంచి గోదావరి జలాలను వదులుతుండటంతో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో 15 వేలకు పైగా ఎకరాలు సాగవుతోంది.

Published : 22 Feb 2024 02:23 IST

హల్దీవాగుతో 15వేల ఎకరాల్లో రెండు పంటలు

కిష్టాపూర్‌ వద్ద చెక్‌డ్యాం పై నుంచి పారుతున్న నీరు

న్యూస్‌టుడే, తూప్రాన్‌: హల్దీవాగు రైతులకు ఎంతో మేలు చేస్తోంది. మండుటెండల్లోనూ పొలాలు పచ్చగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ వాగు నుంచి గోదావరి జలాలను వదులుతుండటంతో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో 15 వేలకు పైగా ఎకరాలు సాగవుతోంది. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం తున్కిఖల్సా సమీపంలో తపాస్‌ఖాన్‌ చెరువు వద్ద పుడుతున్న హల్దీవాగు చౌదర్‌పల్లి, గుంటిపల్లి, శాకారం, అంబర్‌పేట, సీతారాంపల్లి, అనంతగిరిపల్లి, వేలూరు, నాచారం మీదుగా తూప్రాన్‌ మండలం యావాపూర్‌, కిష్టాపూర్‌, గుండ్రెడ్డిపల్లి, వెంకటరత్నాపూర్‌, నాగులపల్లి, వెలుర్తి మండలం కొప్పులపల్లి, మెల్లుర్‌ ఉప్పులింగాపూర్‌, రామాయపల్లి, కుకునూర్‌, శెట్‌పల్లికలాన్‌, చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి, మెదక్‌ మండలం బాలనగర్‌, కొల్చారం మండలం కొంగోడు గ్రామాల పొలాలకు నీరందిస్తోంది. రైతులు ఈ నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారు. వాగుకు ఇరువైపుల ఉండే పొలాలకు మోటార్లను బిగించి నీటిని మళ్లిస్తున్నారు. దీంతో పాటు వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి గతంలో వేసిన బోరు బావులు సైతం ఎక్కువగా నీరు పోస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తూప్రాన్‌ శివారులో పచ్చగా వరి పంట

రెండు పంటల విధానం..

హల్దీవాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు ద్విపంటల విధానంతో అధిక లాభం చేకూరుతోంది. మెదక్‌, సిద్దిపేట జిల్లాలోని సుమారు 50 గ్రామాల రైతులకు హల్దీవాగు ఎంతో లాభాలను చేకూర్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హల్దీవాగులోకి గోదావరి జలాలను విడుదల చేయడంతో గత రెండేళ్లుగా రైతులు రెండు పంటలను సాగు చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో మాత్రమే వరి పంటలను సాగు చేసే రైతులు ప్రస్తుతం రబీలోనూ పండిస్తున్నారు. ఈ వాగు వెంట సమృద్ధిగా నీరు ఉండడంతో చాలా మంది రైతులు భారీగా రకరకాలైన వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇలా నీరు ఎప్పుడూ ఉంటే భవిష్యత్‌లోనూ ఇలాగే పంటలు సాగు చేస్తామని రైతులు చెబుతున్నారు. రెండేళ్లతో పోల్చితే గత ఏడాది రెండింతల దిగుబడి వచ్చిందని రైతులు పేర్కొన్నారు.

నీరు ఆగితే కష్టమే..

హల్దీవాగు పరివాహక ప్రాంతంలో ఏటా ఎండా కాలంలోనూ నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత నీట విడుదల ఆగిపోవడంతో అవస్థలు పడుతున్నారు. మోటార్లు, హల్దీవాగుపై ఆధారపడే రైతులు నీరు లేక అల్లాడే పరిస్థితి ఉంది. గత ఏడాది సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇబ్బందులుపడ్డారు. అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరంతరం నీరుండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

నిరంతరం నీరుండాలి - మల్లయ్య, రైతు తూప్రాన్‌

హల్దీవాగు పక్కనే రెండెకరాల పొలం ఉంది. గతంలో ఒకే పంటను సాగు చేశాను. ప్రస్తుతం వాగులో నీరు ఎక్కువ ఉండడంతో రెండు పంటలను పండిస్తున్నాను. గతంతో పోల్చితే అధిక దిగుబడి వచ్చింది. ఇలానే ఉంటే భవిష్యత్‌లోనూ హల్దీవాగుతో మంచి జరుగుతుంది. నీటి సరఫరా నిరంతరం ఉండేలా అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని