logo

సార్లు.. సమయానికి రారు!

విద్యార్థులకు గురువులే మార్గదర్శకులు.. వారి భవితకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులే. పాఠ్యాంశాలు బోధిస్తూ, చిన్నారుల ఉన్నతికి నిచ్చెన వేస్తారు. వారే సమయపాలన పాటించకుంటే, భవిష్యత్తులో రేపటి పౌరులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Published : 22 Feb 2024 06:32 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం,
నారాయణఖేడ్‌, నాగల్‌గిద్ద, కల్హేర్‌ , జోగిపేట టౌన్‌, రాయికోడ్‌, మునిపల్లి.

ప్రాథమిక పాఠశాల: అందోలు గ్రామం కొట్టాల,
పరిస్థితి: ఉదయం 9.50 గంటల వరకు ఉపాధ్యాయుడు రాలేదు. దీంతో ఆయానే తరగతులు పర్యవేక్షించారు. అనంతరం  ఉపాధ్యాయుడు వచ్చారు.


విద్యార్థులకు గురువులే మార్గదర్శకులు.. వారి భవితకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులే. పాఠ్యాంశాలు బోధిస్తూ, చిన్నారుల ఉన్నతికి నిచ్చెన వేస్తారు. వారే సమయపాలన పాటించకుంటే, భవిష్యత్తులో రేపటి పౌరులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో బుధవారం ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేసింది. ఆ వివరాలు ఇలా..

ప్రాథమిక పాఠశాల: నాగల్‌గిద్ద మండలం రేఖ్యానాయక్‌తండా
పరిస్థితి: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు తాళం వేసి ఉంది.

  • జహీరాబాద్‌ పరిధి అల్లీపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు ఒక్కరు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు. ఇక్కడ 44 మంది విద్యార్థులకు 12 మంది మాత్రమే ప్రార్థన సమయానికి వచ్చారు. మరో ఉపాధ్యాయురాలు ప్రార్థన ముగియగానే రాగా, మరొకరు 10 గంటలకు వచ్చారు.
  • ఖేడ్‌ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద మండలం దామర్‌గిద్ద ప్రాథమికోన్నత పాఠశాలను ఉదయం 10 గంటలకు సందర్శించగా ఏడుగురు ఉపాధ్యాయులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయుడితోపాటు నలుగురు ఉపాధ్యాయులు రాలేదు.

ప్రాథమిక పాఠశాల: మునిపల్లి మండలం మక్తక్యాసారం
పరిస్థితి: ఉదయం 10.30 గంటల వరకు ఉపాధ్యాయులు రాలేదు. ఒకే గదిలో కూర్చున్న  చిన్నారులను విద్యార్థులు పర్యవేక్షించారు.

  • మావినెల్లి పరిధి రాంచందర్‌తండా, ఇరక్‌పల్లి ఉమ్లానాయక్‌ తండాల్లోని ప్రాథమిక పాఠశాలలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు సందర్శించగా ఆయా పాఠశాలలకు తాళాలే ఉన్నాయి.
  • కరస్‌గుత్తి ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. వలంటీర్లు మాత్రమే కనిపించారు.
  • ఖేడ్‌ మండలం పిప్రి ప్రాథమిక పాఠశాలను ఉదయం 9:50 గంటలకు సందర్శించగా నలుగురు ఉపాధ్యాయులకుగాను ఒక్కరూ రాలేదు. దీంతో విద్యార్థులు వారి కోసం ఎదురు చూస్తూ కనిపించారు.

గార్లపల్లిలో అయిదు తరగతలు విద్యార్థులు ఒకే గదిలో

నిత్యం ‘పదకొండు’ దాటాకే ..!

  • మునిపల్లి మండలం గార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు, నలుగురు ఉండాలి. ప్రార్థన సమయానికి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే వచ్చారు. మరో ఉపాధ్యాయుడు 10.48కు వచ్చారు. ఒకరు సెలవులో ఉండగా, మిగతా వారు గైర్హాజరయ్యారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. నిత్యం  పదకొండు దాటాకే పాఠశాలకు వస్తారని ఆరోపించారు.
  • ఉపాధ్యాయులు సమయపాలన పాటించక పోవడంపై ఎంఈవో దశరథ్‌ను వివరణ కోరగా.. విధుల విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసి, వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

  • కోహీర్‌లోని లాలకుంట ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ప్రార్థనకు హాజరయ్యారు. మిగతా ఇద్దరు ఆలస్యంగా వచ్చారు.

  • ఝరాసంగం మండలం బర్దీపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు ఒక్కరు మాత్రమే విధులకు హాజరు కాగా, ఉన్నత పాఠశాలలో 8 మందికి ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.

  • రాయికోడ్‌ మండలం మాటుర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే నిరీక్షించారు. ఉదయం 9.50 నిమిషాలకు ఆమె వచ్చాక  ప్రార్థన చేశారు.

తప్పని సరిగా పాటించాల్సిందే..
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

ఉపాధ్యాయులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. ఉదయం 9.30 గంటల వరకు పాఠశాలలకు రావాల్సిందే. ప్రార్థన అందరూ హాజరు కావాలి. ఈ మేరకు తనిఖీలు చేయాలని మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని