logo

వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాళ్ల కడియాల విషయమై గొడవ జరగ్గా భర్త, అప్పుల బాధతో సతమతం అవుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేటలో ఓ మహిళ బలవంతంగా ప్రాణం తీసుకుంది.

Published : 23 Feb 2024 01:12 IST

రాయగిరి

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాళ్ల కడియాల విషయమై గొడవ జరగ్గా భర్త, అప్పుల బాధతో సతమతం అవుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేటలో ఓ మహిళ బలవంతంగా ప్రాణం తీసుకుంది.

కాళ్ల కడియాల విషయమై గొడవ

కౌడిపల్లి: ఇంట్లో కాళ్ల కడియాల విషయమై జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలం కొట్టాలలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుమ్మల రాయగిరి(45), సుజాత దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. చిన్న కూతురు భవానీకి పెళ్లి చేయగా.. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. మనవరాలి కాళ్ల కడియాలను ఐదు రోజుల క్రితం రాయగిరి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా విక్రయించాడు. ఈ విషయమై తల్లి సుజాత, కూతురు భవానీ అతడితో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాయగిరి బుధవారం రాత్రి అందరూ నిద్రించాక పక్కనే ఉన్న పూరింట్లో చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం చూసేసరికి విగత జీవిగా కనిపించాడు. మృతుడి అన్న దుర్గయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.


అప్పుల బాధతో కూలీ..

రామాయంపేట: అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రంజిత్‌ తెలిపిన వివరాలు.. రామాయంపేటకు చెందిన దాకి రమేష్‌(30) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంపాదన సరిపోక అప్పులు చేయగా.. వాటిని తీర్చలేక మనోవేదన చెందాడు. ఈ నెల 20న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన భార్య మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. గురువారం స్థానిక మల్లెల చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని పరిశీలించగా రమేష్‌గా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.


పెద్దారెడ్డిపేటలో మహిళ..

పుల్కల్‌: ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పుల్కల్‌ మండల పరిధి పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు... అందోలు మండలం రాంసానిపల్లికి చెందిన పెద్దగొల్ల పుష్పలత(36)కు పెద్దారెడ్డిపేటకు చెందిన పండరితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. పండరి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుష్పలత తన అత్త, ఇద్దరు కుమారులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో కుమారులు ఇంట్లో లేరు. గురువారం అత్త లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా వేలాడుతున్న కోడలిని గుర్తించి బోరున విలపించింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎస్‌ఐ వివరించారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ములుగు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రవల్లికి చెందిన బత్తుల రాజు (30) గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ట్రాక్టర్‌పై ఎర్రవల్లికి వస్తున్నాడు. గ్రామంలోకి రాగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ బోల్తాపడి రాజు కింద పడిపోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుకు రెండేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.


రెండు ఏటీఎంలలో చోరీ యత్నం

తూప్రాన్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పురపాలక పరిధి పోతరాజుపల్లి సమీపంలోని రెండు ఏటీఎంలలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం కేంద్రంలోకి చొరబడి సీసీ కెమెరాలు ఇతర కనెక్షన్లను తొలగించాడు. ఇండియా-1 ఏటీఎం కేంద్రంలోకి చొరబడి బండ రాయితో వాటిని ధ్వంసం చేశాడు. ఉదయం గమనించిన స్థానికులు బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూప్రాన్‌ పోలీసులు, క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చోరీకి యత్నించిన తీరును పరిశీలించారు. నిందితుడు రాయితో ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగదు చోరీ కాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏఎస్‌ఐ లక్ష్మి తదితరులున్నారు.


అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు

కోహీర్‌(జహీరాబాద్‌): నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించాడు. హద్నూర్‌ ఎస్సై రామానాయుడు తెలిపిన వివరాలు.. రాయికోడ్‌ మండలం మాటూరుకు చెందిన మహ్మద్‌ రఫి(37) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 19న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు అన్ని చోట్ల వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో రాయికోడ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చాల్కి కూడలి సమీపంలో మృతదేహం ఉన్నట్లు స్థానికుల ద్వారా పోలీసులకు గురువారం సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఆనవాళ్ల ఆధారంగా రఫిగా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రఫికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


లారీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు

మేడ్చల్‌, న్యూస్‌టుడే: అతివేగంగా, నిర్లక్ష్యంగా లారీ నడిపి 8 మంది మరణానికి కారకుడైన డ్రైవర్‌కు రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.11 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. అదనపు పీపీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొంపల్లిలో 2016 ఆగస్టు 31న సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ పిట్టలగేరికి చెందిన ఇర్ఫాన్‌ సోదరి పెళ్లి జరగాల్సి ఉంది. అదే రోజు రాత్రి బాహ్యవలయ రహదారి మీదుగా టవేరాలో ఇర్ఫాన్‌ తన స్నేహితులతో కలిసి కొంపల్లి వస్తున్నారు. మేడ్చల్‌ పరిధి సుతారిగూడలోని అప్పటి తాత్కాలిక టోల్‌ గేటు వద్ద ఓ లారీ డ్రైవర్‌ టోల్‌ చెల్లిస్తున్నాడు. దాని వెనక టవేరా ఆపారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన మరో లారీ టవేరాను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. రెండు లారీల మధ్యలో టవేరా నుజ్జుకావడంతో అందులోని అఖిల్‌, నిషాత్‌, ఫిరోజ్‌, ఇమ్రోజ్‌, అక్బర్‌, సమీర్‌, ఇర్ఫాన్‌, సఖావత్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. అబ్దుల్‌ జలాల్‌ ఫిర్యాదు మేరకు ఒడిశాకు చెందిన డ్రైవర్‌ శైలేందర్‌ పాండే(45)పై మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ మేడ్చల్‌ 9వ మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి దిలీప్‌ నాయక్‌ తీర్పు ఇచ్చారు.


బావిలో మహిళ మృతదేహం లభ్యం

టేక్మాల్‌, న్యూస్‌టుడే: బావిలో పడిన మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. టేక్మల్‌ ఏఎస్‌ఐ తుక్కయ్య తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఎల్లంపల్లికి చెందిన కొండి అనిత(32) మేకలను మేపడానికి ఎప్పటి మాదిరిగానే బుధవారం వెళ్లింది. సాయంత్రం టేక్మాల్‌, ఎల్లంపల్లి సరిహద్దు ప్రాంతంలోని బావిలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడింది. రాత్రి వరకు గాలించినా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం స్థానికులు మరోసారి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిత భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని