logo

ఆరేళ్లుగా ఆగుతూ.. సాగుతూ..

వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సహజంగానే వెలసిన కొండలు, ప్రకృతి అందాలు, వాగులు వంకలున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చొరవ చూపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు 2018లో నాటి ప్రభుత్వం నాచగిరి హల్దీవాగు సుందరీకరణ పనులకు రూ.7.48 కోట్ల నిధులు విడుదల చేశారు. 

Published : 23 Feb 2024 01:13 IST

హల్దీ సుందరీకరణపై నిర్లక్ష్యం

సుందరీకరించాల్సిన మూల వాగు ప్రాంతం

న్యూస్‌టుడే, వర్గల్‌: వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సహజంగానే వెలసిన కొండలు, ప్రకృతి అందాలు, వాగులు వంకలున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చొరవ చూపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు 2018లో నాటి ప్రభుత్వం నాచగిరి హల్దీవాగు సుందరీకరణ పనులకు రూ.7.48 కోట్ల నిధులు విడుదల చేశారు.  ఏడాదిలోనే పనులు పూర్తి చేసి భక్తులకు సరైన వసతులు కల్పించాలనుకున్నారు.కానీ ఆరేళ్లుగా పనులు ఆగుతూ.. సాగుతుండటం గమనార్హం.

ప్రణాళిక ఇదీ.. హల్దీ మూలవాగు నుంచి 600 మీటర్ల దూరం వరకు కరకట్టలు, స్నాన ఘట్టాలు, నీటి నిల్వకు చెక్‌డ్యాంల నిర్మాణం, మురుగు నీరు చెక్‌ డ్యాంలోకి చేరకుండా మూలవాగు ఆవలకు మళ్లించేలా కాలువ నిర్మాణం చేపట్టాలి. ఈ పరివాహక ప్రాంతం మొత్తం ఆకర్షణీయంగా ఉండేలా పూల మొక్కలు, పార్కును తలపించేలా అందంగా తీర్చిదిద్దాలి.

జరుగుతోందిలా..  ఇప్పటి వరకు స్నాన ఘట్టాల పనులు నడుస్తున్నాయి. మురుగు కాలువ నిర్మాణం కొనసాగుతోంది. ఏడాది క్రితం కొంత నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారు. చెక్‌డ్యాం వరకు వాగులోని రాళ్లను తొలగించి నీరు నిల్వ ఉండేలా  ఏర్పాటు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారు తనకు నచ్చినట్లుగా పనులు చేసుకుంటూ ఆపేస్తూ వెళ్తున్నా అడిగేవారు లేరు.
మరో నెలలో బ్రహ్మోత్సవాలు.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తారు. సంగారెడ్డి కాలువ గుండా హల్దీలోకి జలాలను విడుదల చేయగానే నీరు వచ్చిందని పనులు నిలిపేస్తారు. ఇదే తంతు ఆరేళ్లుగా కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో నాచగిరి క్షేత్రం వద్ద బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల్లో హల్దీ జలాలు ఇక్కడికి చేరుకోనున్నాయి. ఈ సారైనా పనులను ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

చివరి దశకు చేరుకున్నాయి..

సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లోపు పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించాం. సీసీ రోడ్డు, మురుగు కాలువ, ఆలయం ముందు గోడ నిర్మాణ పనులు మాత్రమే మిగిలాయి. త్వరలోనే పూర్తి చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

పవన్‌కుమార్‌, గజ్వేల్‌ డివిజన్‌ నీటిపారుదల డీఈఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని