logo

ప్రయాణానికి ప్రయాస

ఏ బస్సు చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సీటు మాట దేవుడెరుగు నిల్చోనైనా వెళ్లాలని ప్రయాణికులు భావిస్తున్నారు. మేడారం జాతరకు జిల్లాకు చెందిన బస్సుల తరలింపుతో ఇక్కడ కొరత ఏర్పడింది. ప్రధాన రూట్లలోనూ ప్రయాణికులకు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి.

Published : 23 Feb 2024 01:18 IST

పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికుల నిరీక్షణ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ఏ బస్సు చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సీటు మాట దేవుడెరుగు నిల్చోనైనా వెళ్లాలని ప్రయాణికులు భావిస్తున్నారు. మేడారం జాతరకు జిల్లాకు చెందిన బస్సుల తరలింపుతో ఇక్కడ కొరత ఏర్పడింది. ప్రధాన రూట్లలోనూ ప్రయాణికులకు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి.

జిల్లాలో తిరుగుతున్నవి సగమే..: జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 246 బస్సులు ఉండగా.. ఇందులో 124 బస్సుల్ని మేడారం జాతర కోసం కరీంనగర్‌, వరంగల్‌ డిపోలకు తరలించారు. రీజియన్‌ పరిధిలో 8 ఆర్టీసీ డిపోలు ఉండగా సంగారెడ్డి డిపో నుంచే అత్యధికంగా 51 బస్సుల్ని పంపారు. మహాలక్ష్మి పథకం అమలులోకి రావడంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అరకొర బస్సులతో నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులు మేడారానికి కేటాయించడంతో సమస్య మరింత పెరిగింది.

విద్యార్థుల కోసం..: గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా విద్యా సంస్థల సమయానికి అనుగుణంగానే బస్సుల్ని నడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు మాత్రమే ఉండటంతో అవి విద్యార్థులతోనే నిండిపోతున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ఉంటే ఆయా రూట్లలో సర్వీసులు రద్దు చేస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌లో కలిపి పల్లె వెలుగు బస్సులు 115 ఉన్నా వీటిలో ఎక్కువ శాతం పట్టణాలకే తిప్పుతున్నారు.

ఎండలో నిరీక్షణ

సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్‌ చౌరస్తా తదితర చోట్ల ప్రయాణ ప్రాంగణాలు లేకపోవడంతో ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ బస్సు వచ్చే వరకు నిరీక్షించడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. సదాశివపేట మండలం పెద్దాపూర్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలోనైనా ప్రయాణికులకు నీడ వసతి కల్పించాల్సిన అవసరముంది. సౌకర్యాల కల్పన కోసం సెస్‌ పేరుతో ప్రయాణఛార్జిపై అదనంగా రూపాయి చొప్పున వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులకు తమ సమస్యలు పట్టడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం: ప్రభులత, ఆర్టీసీ ఆర్‌ఎం

మేడారానికి బస్సుల తరలింపుతో కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించాం. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు సంబంధించిన సర్వీసులకు సమస్య ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని