logo

పెరగనున్న ఆస్తి పన్ను

పురపాలికల్లో ఆస్తి పన్ను మదింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నూతన విధానం అమలు చేయనుంది. ఈ మేరకు పురపాలికల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తుల విలువలను సవరించి ఆస్తి పన్ను విధిస్తారు. ఈ మేరకు ఎంత పన్ను  పెరుగుతుందో వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Published : 23 Feb 2024 01:19 IST

మదింపునకు అధికారుల కసరత్తు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: పురపాలికల్లో ఆస్తి పన్ను మదింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నూతన విధానం అమలు చేయనుంది. ఈ మేరకు పురపాలికల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తుల విలువలను సవరించి ఆస్తి పన్ను విధిస్తారు. ఈ మేరకు ఎంత పన్ను  పెరుగుతుందో వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఖాళీ స్థలాలకు సైతం: చాలా మంది పట్టణాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేస్తున్నారు. ఇలా జిల్లాలోని అన్ని పురపాలికల్లో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలున్నాయి. వీటికి వీఎల్‌టీ(వేకెండ్‌ ల్యాండ్‌ టాక్స్‌) విధించాలి. పురపాలికల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో వీటికి ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు విధించలేదు. ఇక ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించదంటే కుదరదు. ఆస్తి విలువలో కనిష్ఠంగా 0.05, గరిష్ఠంగా 0.20 శాతం పన్ను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లూ కేటాయిస్తారు. ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవాలంటే వీఎల్‌టీ పన్ను రశీదును జత చేయాల్సి ఉంటుంది. పురపాలికల్లో నిధులు లేకపోవడంతో తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు, అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో వేతనాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. మార్చి 31వ తేదీ నాటికి మదింపు ప్రక్రియ పూర్తి చేసి కొత్త పన్ను విధానం అమలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిబంధనలు ఇలా..

జిల్లాలో 8 పురపాలక సంఘాలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నివాస భవనాలకు భవన నిర్మాణ విలువలో కనిష్ఠంగా 0.10 శాతం, గరిష్ఠంగా 1 శాతం ఆస్తి పన్ను పెంచనున్నారు. వాణిజ్య భవనాలకు మార్కెట్‌ విలువలో కనిష్ఠంగా 0.25 శాతం, గరిష్ఠంగా 2 శాతం పన్ను పెరుగుతోంది. పురపాలక చట్టం ప్రకారం 75 గజాలలోపు ఉన్న భవనానికి ఆస్తి పన్ను పెంపు వర్తించదు. వీటితో పాటు చారిత్రక భవనాలు, ఆసుపత్రులు, పురపాలక భవనాలు, అనాథ, వృద్ధాశ్రమాలకు మినహాయింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని