logo

విపణి వీధిలో.. సృజనాత్మక బాటలో..

తరగతి గదులు.. పుస్తకాలు ఇవే వారి లోకం. పాఠాలు వినడం.. అధ్యాపకుల సూచనలు పాటించడం తప్ప బయటి ప్రపంచంతో పరిచయం అంతంతే. ఇలా విద్యార్థినులకు మార్కెటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో విపణి పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

Published : 23 Feb 2024 01:25 IST

వినియోగదారుల నాడి పట్టి

ఫ్యాన్సీ స్టాల్‌ వద్ద రమ్య

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: తరగతి గదులు.. పుస్తకాలు ఇవే వారి లోకం. పాఠాలు వినడం.. అధ్యాపకుల సూచనలు పాటించడం తప్ప బయటి ప్రపంచంతో పరిచయం అంతంతే. ఇలా విద్యార్థినులకు మార్కెటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో విపణి పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థినులు తమ సృజనాత్మకతను చాటేలా హస్తకళలతో ఔరా అనిపించారు. కామర్స్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థినుల ఉజ్వల భవితకు బాటలు వేయడం ఖాయం.

బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని రమ్య వినియోగదారుల నాడిని గుర్తించారు. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్సీ స్టాల్‌ను ఏర్పాటుచేశారు. కొత్త వస్తువులు అందుబాటులో ఉంచడంతో అందరూ వాటిని కొనేందుకు ఉత్సుకత చూపారు. వివిధ చోట్ల నుంచి వాటిని తెచ్చి ఉంచారు. మార్కెట్‌ రేట్‌ కంటే తక్కువకే విక్రయాలు సాగించారు.


వ్యర్థానికి రూపమిచ్చి..

చిత్తు కాగితాలు, పాడైన ఫర్నిచర్‌.. పనికి రానివి అనుకుంటే వ్యర్థాల జాబితాలో చేరిపోతాయి. వాటికి అందమైన రూపం ఇస్తే ఆకట్టుకుంటాయి. బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు అఫీర మహీన్‌, షాహిస్తా అప్రా అదే చేశారు. తమ ఇంట్లో వృథా వస్తువులు సేకరించి వాటిని అలంకరణ సామగ్రిగా తీర్చిదిద్ది ప్రదర్శించారు. రూ.50 నుంచి రూ.200 వరకు అమ్మారు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్‌లో చూసి వ్యర్థాలకు కొత్త రూపమివ్వడం నేర్చుకున్నామని వారు చెప్పారు.

అఫీర మహీన్‌, షాహిస్తా అప్రా


రూ.800కు రూ.1800

ఇక్కడ ఏది కొన్నా రూ.10 మాత్రమే. విపణిలో ఇలాంటివి చూస్తుంటాం. ఇలాంటి ప్రకటనలు చూసి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు భవానీ, ప్రియాంకలు ఇదే సూత్రాన్ని పాటించారు. రవ్వ లడ్డు, నిమ్మకాయ పులిహోర, గులాబ్‌ జామ్‌ను తాము తీసుకున్న స్టాల్‌లో అమ్మకాలు సాగించారు. ఏది కొన్నా రూ.పదే అని బోర్డు తగిలించడంతో గిరాకీ పెరిగింది. రూ.800 పెట్టుబడి పెట్టి రూ.1,800 ఆదాయం సంపాదించారు.

విక్రయిస్తున్న భవానీ, ప్రియాంక


ఆకట్టుకునేలా తీర్చిదిద్ది

కళాశాలకు చెందిన సల్మాసాదియా బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. మరోవైపు తనకిష్టమైన మెహిందీలో రాణిస్తున్నారు. విపణిలో భాగంగా మెహిందీ డిజైనింగ్‌ స్టాల్‌ ఏర్పాటుచేశారు. విద్యార్థినులతో పాటు అధ్యాపకులూ స్టాల్‌ వద్ద బారులు తీరారు. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో మెహిందీ డిజైనింగ్‌లో మెలకువలను నేర్చుకోవడం ఇలా పనికొచ్చిందని సల్మాసాదియా తెలిపారు.

మెహిందీ వేస్తున్న సల్మా సాధియా


తేనీటి విక్రయం.. ఆదాయం

నవనీత, అనూరాధ, మధులతలు కళాశాల ఆవరణలోని వసతిగృహంలో ఉంటూ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విపణిలో వీరు టీ స్టాల్‌ను ఎంచుకున్నారు. అల్లం ఛాయ్‌ రూ.10, గ్రీన్‌ టీ రూ.15గా ధర నిర్ణయించి విక్రయించారు. పెట్టిన పెట్టుబడికి రెండితల ఆదాయాన్ని సంపాదించారు. సంగారెడ్డి కలెక్టర్‌  వల్లూరు క్రాంతి తేనీరు రుచి చూసి బాగుందని కితాబునిచ్చారు.

విద్యార్థినులు నవనీత, అనూరాధ, మధులత


పండగలకు వేదికగా..

దేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. పండగలు వీటన్నింటినీ సజీవంగా ఉంచుతున్నాయి. మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం ఈ పండగలన్నింటికీ వేదికైంది. సంక్రాంతి, దీపావళి, ఉగాది, వినాయక చవితి తదితర హిందూ పండగలతో పాటు క్రైస్తవ, మైనార్టీల పండగల ప్రత్యేకతలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఆయా పండగల సమయంలో ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచగా.. సందర్శకులు కొనుగోలుకు పోటీ పడ్డారు.

వంటలు వండుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని