logo

మెదక్‌ రైల్వేస్టేషన్‌కు అమృత్‌ కాలం

కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల స్థితిగతులను మార్చి ఆధునికీకరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం అమృత్‌ భారత్‌ స్టేషన్‌. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయనుంది.

Published : 23 Feb 2024 01:28 IST

కేంద్ర పథకానికి ఎంపిక
26న వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని శంకుస్థాపన

న్యూస్‌టుడే, మెదక్‌: కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల స్థితిగతులను మార్చి ఆధునికీకరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం అమృత్‌ భారత్‌ స్టేషన్‌. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో జహీరాబాద్‌, తాండూరు, వికారాబాద్‌ రైల్వేస్టేషన్లు ఎంపికైన విషయం విదితమే. ఆయా చోట్ల స్లేషన్లలో ప్రగతి పనులు చేపట్టారు. ఎస్కలేటర్లు, అదనంగా లైన్‌, పార్కింగ్‌ తదితర వసతులు కల్పించేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మరో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 40 స్టేషన్లను ఎంపిక చేయగా, ఈ జాబితాలో మెదక్‌కు చోటు దక్కడం విశేషం.

రూ.210 కోట్లతో.. మెదక్‌ జిల్లాలో మాసాయిపేట, వడియారం (చేగుంట), మనోహరాబాద్‌, అక్కన్నపేట, రామాయంపేటల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఆయా మార్గాల్లో పలు రైళ్లు నడుస్తున్నాయి. 2012-13లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ పట్టణం వరకు 17.2 కి.మీ. మేర రైల్వేలైన్‌ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. 2014 జనవరిలో శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయగా.. రూ.210 కోట్లతో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022 సెప్టెంబరు 23న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి.

ఏడాదిన్నరకే.. రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుండగా, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకానికి ఎంపికవడం గమనార్హం. రూ.15.29 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సోమవారం (ఈనెల 26న) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లకు ఆహ్వానాలను సంబంధిత అధికారులు అందించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రైల్వేశాఖ అధికారులు ఇక్కడికి రానున్నారని సమాచారం.

చేపట్టనున్న పనులు

  • పార్కింగ్‌ షెడ్డు ఏర్పాటు
  • సెల్ఫీపాయింట్‌
  • ముఖ్యమైన సమాచార బోర్డుల ఏర్పాటు
  • ప్రవేశ మార్గాల ఆధునికీకరణ
  • లిఫ్ట్‌ సౌకర్యం
  • ప్లాట్‌ఫాం ఉపరితలాన్ని తీర్చిదిద్దడం
  • దివ్యాంగులకు ప్రత్యేక శౌచాలయాలు, ర్యాంపులు, టెక్‌టైల్‌ ఫ్లోరింగ్‌
  • జనరేటర్‌ సౌకర్యం
  • ల్యాండ్‌ స్కేపింగ్‌
  • విద్యుత్తు దీపాల బిగింపు
  • సంకేతాల ఏర్పాటు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు