logo

రహదారుల చెంత మృత్యుకుహరాల చింత

రహదారుల పక్కన బావులు, చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏళ్లుగా ఉన్న వాటిని పూడ్చకపోవడం.. చుట్టూ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుంటున్నాయి. దీంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

Published : 23 Feb 2024 01:35 IST

పాపన్నపేట మండలం నర్సింగరావు తండా వద్ద బావి

న్యూస్‌టుడే-మెదక్‌, మెదక్‌ రూరల్‌, రామాయంపేట, చేగుంట, పాపన్నపేట, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, నర్సాపూర్‌ రూరల్‌, రేగోడ్‌, తూప్రాన్‌, హవేలిఘనపూర్‌ 

హదారుల పక్కన బావులు, చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏళ్లుగా ఉన్న వాటిని పూడ్చకపోవడం.. చుట్టూ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుంటున్నాయి. దీంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

అజాగ్రత్తగా నడిపితే..

నార్సింగి మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారి పక్కనే క్యాసంపల్లి చెరువు ఉంది. ముందే జాతీయ రహదారి.. వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. నాగ్‌పూర్‌, నిజామాబాద్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా నీటి వనరులో పడిపోవాల్సిందే. గతంలో ఎరువుల లారీ పడిపోయింది. రెయిలింగ్‌ ఉన్నా వాహనాలు వేగంగా వెళ్లి ఢీకొని చెరువులో పడిపోయే ప్రమాదం ఉంది.

వంపులు తిరిగి.. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే మార్గంలో మల్లెల చెరువు చెంత ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నుంచి వెళ్లే రోడ్డు వంపులు తిరిగి ఉంది. ఈ కారణంగా భయం గుప్పెట్లో వెళ్లాల్సి వస్తుంది. గతేడాది ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మరో ఘటనలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలో కోల్పోయాడు.

రెండేళ్లలో ఐదుగురు..

తూప్రాన్‌ నుంచి కిష్టాపూర్‌ మార్గానికి ఆనుకొని బావి ఉంది. గుండ్రెడ్డిపల్లి వెళ్లే దారిలో లోయ మాదిరిగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అల్లాదుర్గం మండలం అకోలా-నాందేడ్‌ జాతీయరహదారి నుంచి రాంపూర్‌ వెళ్లే చెరువు కట్ట మీద ఉన్న రోడ్డుపై కంకర తేలి గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాల బారిన పడ్డారు.

  • మెదక్‌ మండలం పాతూర్‌ నుంచి రాయిన్‌పల్లి మార్గంలో దారి పక్కనే పాడుబడ్డ బావి ఉంది. అధికారులు స్పందించి పూడ్చి వేయించాలని చోదకులు కోరుతున్నారు. మెదక్‌ నుంచి రామాయంపేటకు పోయే మార్గంలో అవుసులపల్లి శివారులో రోడ్డు పక్కన బావిని పూడ్చాల్సిన అవసరం ఉంది. అధికారులు స్పందించాలి.

ప్రమాదం పొంచి ఉంది..

  • పాపన్నపేట మండలం నర్సింగరావు తండా వద్ద ఓ పాడుబడ్డ బావి ఉంది. ఇక్కడ వాహనాలు అదుపు తప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  • మాసాయిపేట మండలంలోని బొమ్మారం, నాగ్‌సాన్‌పల్లి గ్రామాల మధ్యన ఎర్ర కుంట, మరో చిన్న కుంటల కట్టల మీదుగా రహదారి గుంతలమయంగా ఉంది.
  • హవేలిఘనపూర్‌ మండలం నాగ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో సుల్తాన్‌పూర్‌ సమీపంలో చెరువు కట్ట మీదుగా భయభయంగా ప్రయాణం సాగించాల్సిందే.
  • నర్సాపూర్‌ మండలం నాగులపల్లిలోని చెరువు కట్ట సరిగ్గా లేదు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందులో పడిపోవడం ఖాయం.
  • పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి గ్రామానికి వెళ్లే వంతెనకు ఇరువైపులా రెయిలింగ్‌ లేదు. వర్షాకాలంలో వాగు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వంతెనపై నుంచి వెళ్లడానికి ఆచితూచి ప్రయాణించాల్సి ఉంటుంది.
  • రేగోడ్‌, చౌదర్‌పల్లి శివారులో రోడ్డు పక్కనే బావులు, గుంతలు ఉండటంతో ప్రయాణికులు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని