logo

సరకులెక్కడ పెట్టాలి

అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. చిన్న అద్దె గదుల్లో నిర్వహించడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు.

Published : 23 Feb 2024 01:37 IST

అద్దె గదుల్లో అవస్థలు

నర్సాపూర్‌లో భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. చిన్న అద్దె గదుల్లో నిర్వహించడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు.

నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 15 వార్డులున్నాయి. 4, 5 వార్డులో నిర్వహించాల్సిన ఒక అంగన్వాడీ కేంద్రాన్ని పురపాలిక ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సొంత భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదిలో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. పురపాలిక పరిధిలోకి వచ్చే తుకారాంతండాలో మినీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 25-30 మంది చిన్నారులున్నారు. 15-20 మంది గర్భిణులు, 30 మంది వరకు బాలింతలు ఉన్నారు. వీరంతా పౌష్టికాహారం తీసుకోవడానికి కేంద్రానికి వస్తే సరిపడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు.

అద్దె తక్కువగా ఉండటంతో.. అద్దె చాలా తక్కువగా ఉండటంతో ఆ మొత్తానికి విశాలమైన గదులు లభించడం లేదు. దీంతో శిథిలావస్థకు చేరిన పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, ఇరుకు గదుల్లోనే కొనసాగిస్తున్నారు. సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలో నెట్టుకు వస్తున్నారు.

అక్రమాలకు అవకాశం.. ప్రభుత్వం పంపిణీ చేసే సరకులు, సామగ్రి, నిల్వ చేసుకునేందుకు స్థలం చాలక టీచర్లు వారి ఇళ్లలో భద్రపరుస్తున్నారు. దీంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతుంది. పురాతన భవనాల్లో సరకులు ఉంచితే ఎలుకలు, పందికొక్కుల కారణంగా పాడవుతున్నాయి.

వెనక్కి మళ్లిన నిధులు.. అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్న వాటికి నీటి సదుపాయం, ప్రహరీ, శౌచాలయాల వంటి వసతులు లేవు. పదేళ్ల క్రితం భవనాల నిర్మాణానికి శిలాఫలకాలు సైతం వేశారు. కాని నేటికీ అతీగతీ లేదు. అప్పట్లో ఒక్కోదానికి రూ.6.5 లక్షలు చొప్పున కేటాయించినా ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీంతో నిధులు వెనక్కి పోయాయి.  

రెండింటికి స్థలాల ప్రతిపాదన

సరళాకుమారి, పర్యవేక్షకురాలు నర్సాపూర్‌

పట్టణంలోని రెండు కేంద్రాలకు పురపాలిక ఆవరణలో, సునీతారెడ్డి కాలనీలో స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఏళ్లు గడుస్తున్నా వాటికి ఆమోదం రాలేదు. పట్టణం కావడంతో ప్రభుత్వ స్థలాలు సైతం అందుబాటులో ఉండటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని