logo

ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదాతో సరి

పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల వాయిదాతో సర్కారు బడుల ప్రగతి, పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పీఎంశ్రీ (ప్రధాన్‌ మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం కింద పలు పాఠశాలలకు నిధులు విడుదలైనా వెచ్చించలేని పరిస్థితి నెలకొంది.

Published : 24 Feb 2024 02:33 IST

పాఠశాలల ప్రగతిపై ప్రభావం

న్యూస్‌టుడే, సిద్దిపేట: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల వాయిదాతో సర్కారు బడుల ప్రగతి, పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పీఎంశ్రీ (ప్రధాన్‌ మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం కింద పలు పాఠశాలలకు నిధులు విడుదలైనా వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల విరామం తరువాత గత నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా వాయిదా వేయడంతో మొదటికి వచ్చింది. ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్న తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. తుదిగా 2019 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకు కమిటీల గడువు ముగిసినా.. పొడిగిస్తూ వచ్చారు. అంతిమంగా కమిటీల ఎన్నికలకు షెడ్యూల్‌, మార్గదర్శకాలు గత నెలలో జారీ చేశారు. సభ్యులు, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికను జిల్లాలోని 1018 పాఠశాలల్లో చేపట్టేందుకు సిద్ధమైనా ఫలితం లేకపోయింది.

ప్రకటించి.. వెనకడుగు వేసి.. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాలు - 980, గురుకులాలు - 36, ఎయిడెడ్‌ - 2 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గత జనవరి 20న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదే నెల 29న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కమిటీ తొలి సమావేశం కూడా అదే రోజు చేపట్టాలని నిర్ణయించారు. సమగ్ర శిక్షా, విద్యాశాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు గత నెల 23న ప్రభుత్వం అనూహ్యంగా పాత కమిటీలను రద్దు చేయడంతో పాటు ఎన్నికలు వాయిదా వేసింది. జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద మొదటి విడతగా 27 పాఠశాలలను ఎంపిక చేశారు. వివిధ విభాగాల కింద నిధులు విడుదలయ్యాయి. 16 పాఠశాలలకు సైన్స్‌ ల్యాబ్‌లను మంజూరు చేశారు.

ఖర్చులు.. రూపకల్పన ఎలా.. ఎస్‌ఎంసీలు.. అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఖాతాలో నిధులు ఖర్చు చేయాలంటే ప్రధానోపాధ్యాయుడితో పాటు ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ సంతకం తప్పనిసరి. మన ఊరు- మన బడి, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు, ఏకరూప దుస్తులు, పుస్తకాల పంపిణీ, శౌచాలయాలు, తాగునీరు, మైదానాలు, క్రీడా సామగ్రిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదనపు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఇకపై రూపకల్పన ఎలా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని.. బడుల ప్రగతిపై ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తామని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని