logo

వక్ఫ్‌ బోర్డు స్థలాలు.. జోరుగా ఆక్రమణలు

జిల్లాలో వక్ఫ్‌ బోర్డు స్థలాలను ఎక్కడికక్కడ ఆక్రమిస్తున్నారు. రాజకీయ పలుకుబడితో కొందరు బరి తెగిస్తున్నారు. కబ్జాదారులు ఆక్రమణలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 24 Feb 2024 02:35 IST

గజ్వేల్‌ వక్ఫ్‌బోర్డు స్థలంలో నిర్మాణాన్ని కూల్చేస్తూ..

న్యూస్‌టుడే, గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌: జిల్లాలో వక్ఫ్‌ బోర్డు స్థలాలను ఎక్కడికక్కడ ఆక్రమిస్తున్నారు. రాజకీయ పలుకుబడితో కొందరు బరి తెగిస్తున్నారు. కబ్జాదారులు ఆక్రమణలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల వక్ఫ్‌ బోర్డుకు ఛైర్మన్‌ను నియమించిన నేపథ్యంలో కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థిరాస్తుల విలువ భారీగా పేరిగిన నేపథ్యంలో స్థలాలను విక్రయిస్తున్నారు. కొందరు తెలివిగా లీజు పేరుతో అక్రమాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిబంధనలు అతిక్రమించి.. గజ్వేల్‌ పట్టణంలోని స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు నియోజకవర్గానికి చెందిన ఇరువురు నేతలు గుట్టుగా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే వక్ఫ్‌ బోర్డు స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారనేది ప్రశ్నగా మిగిలింది. మసీదులు, దర్గాల నిర్వహణకు కేటాయించిన భూముల్లో నిబంధనలు అతిక్రమించి ఎలాంటి నిర్మాణాలు, క్రయవిక్రయాలు చేయకూడదు. కొన్నిచోట్ల ఏటా వాణిజ్య సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు సాగిపోతునే ఉన్నాయి.

బినామీలతో వ్యవహారం.. దస్త్రాల ప్రకారం గజ్వేల్‌లో 292.29 ఎకరాల భూములున్నాయి. ఇందులో 5.25 ఎకరాల్లో మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాలున్నాయి. కొంత రోడ్ల విస్తరణలో కలిసిపోయింది. కబ్రస్థాన్‌, పాడుబడిన బావులు, కాలువలు, గుమ్మటాలు పోనూ మిగతా సుమారు 200 ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంటుందని అధికారుల అంచనా. జాలిగామ రోడ్డులో కొంత భూమి సాగులో ఉంది. ఇతర చోట్ల రూ.20 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమించారు. కొందరు నేతలు బినామీలతో నిర్మాణాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు తూతూమంత్రంగా పాక్షిక ధ్వంసం చేసి ఊరుకుంటున్నారు.

మళ్లీ నిర్మాణాలు.. గజ్వేల్‌ ఇందిరాపార్కు నుంచి తూప్రాన్‌ రోడ్డులో, జాలిగామ బైపాస్‌ రోడ్డులో పలుపార్టీలకు చెందిన పెద్దలు స్థలాల్లో దుకాణ సముదాయాలు నిర్మించుకున్నారు. దుబ్బాకలో నాలుగు చోట్ల ఐదు ఎకరాల స్థలం ఆక్రమించారని స్థానికులు చెబుతున్నారు. హుస్నాబాద్‌లో ఖాళీ స్థలాలు లేవు. ఇటీవల ప్రహరీ నిర్మించారు. సిద్దిపేట శివారులో సుమారు 10 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూమి ఆక్రమించగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంగునూరులో ఆరు చోట్ల కబ్జాకు గురయ్యాయని మసీదు కమిటీ సభ్యులు తెలిపారు.

ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం:

శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌

జిల్లాలో ఎక్కడైనా వక్ఫ్‌ బోర్డు భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. వాటి పై నిఘా పెట్టాం. క్షేత్రస్థాయి అధికారులకు పర్యవేక్షణకు సూచనలిచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని