logo

చేనుకు జలం.. కర్షకులకు ఫలం

భూమి దుక్కులు దున్నే సమయం నుంచే అన్నదాతకు కష్టాలు మొదలవుతాయి. విత్తు నాటినప్పటి నుంచి వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి. వర్షపు చుక్క నేలపై పడితేనే విత్తనాలు మొలకెత్తేది. వర్షాభావ పరిస్థితులు తలెత్తుతే ఆరుగాలం శ్రమకు ప్రతిఫలం ఉండదు.

Published : 24 Feb 2024 02:36 IST

ఎస్సీ, ఎస్టీలకు బోరు బావుల పథకానికి కొనసాగుతున్న సర్వే

క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కంది(ఇంద్రకరణ్‌): భూమి దుక్కులు దున్నే సమయం నుంచే అన్నదాతకు కష్టాలు మొదలవుతాయి. విత్తు నాటినప్పటి నుంచి వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి. వర్షపు చుక్క నేలపై పడితేనే విత్తనాలు మొలకెత్తేది. వర్షాభావ పరిస్థితులు తలెత్తుతే ఆరుగాలం శ్రమకు ప్రతిఫలం ఉండదు. కష్టాలు.. నష్టాలు ఎదురైనా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న వారే ఎక్కువ. వీరి ఇబ్బందులను కొంతైనా దూరం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పొల్లాలో బోరుబావుల తవ్వకాన్ని చేపట్టనున్నారు.

అర్హులను గుర్తించేందుకు..: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీల నుంచి బోరుబావుల తవ్వకం పథకానికి ఇప్పటికే మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. 811 దరఖాస్తులు అందగా ఇందులో అత్యధికంగా ఎస్సీలకు సంబంధించినవి 736 ఉన్నాయి. ఎస్టీ రైతులు 75 మంది మాత్రమే అర్జీలు కలెక్టరేట్‌లోని భూగర్భ జలశాఖ కార్యాలయంలో అందజేశారు. దరఖాస్తుల ఆధారంగా అధికారులు సర్వే ప్రక్రియ చేపట్టారు. అర్జీదారుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒకే చోట ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే అక్కడ ఎన్ని బోర్లు వేయాల్సి ఉంటుంది. నీటి వనరులు ఎక్కడ ఉన్నాయని పరిశీలించి పాయింట్‌ను గుర్తించనున్నారు. మొదటగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సొంత నియోజకవర్గం అందోలు నుంచే సర్వేను ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బోరుబావుల తవ్వకానికి కలెక్టర్‌ నుంచి పరిపాలన అనుమతులు తీసుకోనున్నారు. ఆ తర్వాత నిధుల మంజూరు కోసం రాష్ట్ర కార్యాలయానికి ప్రతినిపాదనలు పంపుతారు.

ఉప ప్రణాళిక నిధుల కేటాయింపు: అయిదు ఎకరాలకు ఒకటి చొప్పున బోరు వేయనున్నారు. ఇద్దరు ముగ్గురు రైతులకు కొద్దిపాటి భూమి ఉన్నా అందరికీ కలిపి 5 ఎకరాలు ఉంటే వారందరు సమ్మతించిన చోట బోరు వేస్తారు. నీటి వసతి సమకూర్చడం ద్వారా రైతులు కూరగాయలు, పండ్ల తోటలు వేసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఉద్యాన శాఖ, ఉపాధి హామీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా పంట సాగుకు రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం: వెంకటేశ్వర్‌రావు, భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌

ఎస్సీ, ఎస్టీల పొలాల్లో బోర్లు వేసేందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. నీరు ఉండే స్థలాలను గుర్తించి పాయింట్లను ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల కాగానే బోర్లు వేసే పనులు ప్రారంభించనున్నాం. బోర్లు వేయడం ద్వారా లబ్ధిదారుల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఆర్థిక పరిస్థితుల మెరుగుకు మార్గం సుగమం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని