logo

సర్కారు బడులకు కంప్యూటర్లు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయగా.. తాజాగా ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలకు కంప్యూటర్లను కేటాయించారు.

Published : 24 Feb 2024 02:37 IST

బోధకులను నియమిస్తేనే ప్రయోజనం

సంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన కంప్యూటర్లు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయగా.. తాజాగా ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలకు కంప్యూటర్లను కేటాయించారు. గతంలోనూ ప్రభుత్వ బడులకు కంప్యూటర్లు ఇచ్చినా.. బోధకులు లేకపోవడంతో నిరుపయోగంగా మారి పాడయ్యాయి. ఈ సారి అలా కాకుండా బోధకులను ప్రత్యేకంగా నియమిస్తే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందే అవకాశం ఉంటుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి..

జిల్లాలో 105 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 17 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు ఇటీవలే కంప్యూటర్లు సరఫరా చేశారు. ఎంపిక చేసిన బడులకు కంప్యూటర్లతో పాటుగా ప్రింటర్లు, 2కేవీ యూపీఎస్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌, స్వీచ్‌ బోర్డులు, కేబుల్‌ వైర్లు, జాక్‌ ప్యానెల్‌ అందించారు. పాఠశాలలకు ఇప్పటికే ఇవన్నీ చేరుకున్నాయి. మార్చి మొదటి వారంలోపు కంప్యూటర్లను బిగించాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో వినియోగించాలి. 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ కంప్యూటర్లు సరఫరా చేశారు. వంద లోపు విద్యార్థులుంటే ఐదు, 101-200 వరకు 8, 201 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు పది కంప్యూటర్లు కేటాయించారు. పాఠశాలల్లో వీటిని అమర్చిన తరువాత డిజిటల్‌ బోధనతో పాటు విద్యార్థుల వివరాలు అంతర్జాలం చేసేందుకు ఉపాధ్యాయులు వినియోగిస్తారు.

గతంలో ఇబ్బందులు: పాఠశాలలకు కంప్యూటర్లు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటిని బోధించేందుకు ప్రత్యేకంగా బోధకులను నియమించాలని కోరుతున్నారు. 2016లో పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించేందుకు ఎంపిక చేసిన వాటికి కంప్యూటర్లు సరఫరా చేశారు. కొన్ని సంవత్సరాలు పార్ట్‌టైం బోధకులను నియమించారు. ఆ తర్వాత వారిని తొలగించడంతో బడుల్లో నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని బోధకులను నియమించుకొని విద్యార్థులకు కంప్యూటర్‌ పాఠాలు చెబుతున్నారు. ఈ సారైనా అన్ని చోట్ల సాంకేతిక బోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాంకేతిక విద్య బోధించే వారిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని