logo

గడువు లోపు గగనమే!

సంగారెడ్డి వైద్య కళాశాల భవనాల పనుల్లో తాత్సారం కొనసాగుతోంది. ఇప్పటికే గడువు పొడిగించుతూ అధికారులు అనుమతించారు. పెంచిన గడువులోగా పనులు పూర్తిచేసేలా కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిధుల కొరత సమస్యను జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.

Published : 24 Feb 2024 02:40 IST

నిధులు లేక నెమ్మదించినవైద్య కళాశాల పనులు

అసంపూర్తిగా భవన నిర్మాణం

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి వైద్య కళాశాల భవనాల పనుల్లో తాత్సారం కొనసాగుతోంది. ఇప్పటికే గడువు పొడిగించుతూ అధికారులు అనుమతించారు. పెంచిన గడువులోగా పనులు పూర్తిచేసేలా కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిధుల కొరత సమస్యను జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.

వివిధ దశల్లో..

  • జిల్లా ఆసుపత్రి ఆవరణలో వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు గత ప్రభుత్వం రూ.142 కోట్లు కేటాయించింది. కళాశాల ఆడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ రెండంతస్తుల భవనాన్ని నిర్మించాలి. ప్రస్తుతం ఫ్లోరింగ్‌, విద్యుత్తు, సీలింగ్‌ తదితర పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
  • బాలుర వసతి గృహం ఏడంతస్తుల భవనం స్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్‌, విద్యుత్తు, తలుపులు తదితర పనులు చేపట్టాలి. డైనింగ్‌హాల్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
  • మార్చురీ, ప్రిన్సిపల్‌, కళాశాల పర్యవేక్షకుల కోసం చేపట్టిన భవనాల పనులకు రూ.40 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది.
  • కళాశాల ఆవరణలో అంతర్గత తారు రహదారులు, విద్యుత్తు సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.  

జూన్‌ వరకు అవకాశం

గత ఏడాది నవంబరు 28 వరకు వైద్య కళాశాల భవనాల పనులు పూర్తి చేసి అప్పగించాలని తొలుత అధికారులు గుత్తేదారుకు నిర్దేశించారు. ఆ దిశగా పనులు కొనసాగక పోవడంతో రానున్న జూన్‌ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జూన్‌ వరకూ వైద్య కళాశాల పనులు పూర్తివడం గగనంగానే కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమూ పనుల జాప్యానికి కారణమే.

వేగవంతం చేస్తాం: రాంబాబు, ఈఈ, ఆర్‌అండ్‌బీ

వైద్య కళాశాల భవనాల పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గడువు మించిపోవడంతో.. జూన్‌ వరకు పొడిగించాం. అప్పటిలోగా నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేస్తాం. వైద్య కళాశాలకు భవనాలను అప్పగిస్తాం. బిల్లులు వచ్చినా.. జాప్యమైనా.. పనులు ఆపవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. గుత్తేదారు సంస్థకు తెలియజేస్తాం. వైద్య విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

అద్దె గదుల్లో ఇబ్బందులు

  • 2021 జూన్‌లో గత ప్రభుత్వం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసింది. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసింది. ఎంబీబీఎస్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులు జరుగుతున్నాయి. భవనాలు మాత్రం ఇంకా వినియోగంలోకి రాలేదు. అద్దె భవనాల్లో వసతి గృహం ఏర్పాటు చేయడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తరగతుల నిర్వహణకు గతంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలోనే నెట్టుకు రావాల్సి వస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని