logo

ఇలా చేశావేంటి చదువుల తల్లి..

ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించి, బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె (17), కుమారుడు (14) ఉన్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

Published : 24 Feb 2024 02:41 IST

మనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించి, బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె (17), కుమారుడు (14) ఉన్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లలిద్దరూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కుమార్తె పదో తరగతి వరకు మండల కేంద్రం మనూరులో చదివింది. 10 జీపీఏతో ఉత్తీర్ణురాలైంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించగా, పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యక్తిగత కారణాలతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

ఉద్యోగం సాధిస్తానని..

ఉద్యోగం సాధించి అమ్మానాన్నలకు అండగా ఉంటానని ఊర్లో చెప్పి బాసరకు వెళ్లిన అమ్మాయి అదే రోజు రాత్రి వసతిగృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కలచివేసింది. వ్యకిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు క్యాంపస్‌ వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అక్కడ లభ్యమైన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను చూసి వాళ్లు గుండెలవిసేలా విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఆ అమ్మాయి మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తరలివచ్చారు.

కష్టపడేతత్వం: భీమ్‌రావు, ఉపాధ్యాయుడు

ఆ విద్యార్థిని పాఠశాలకు డుమ్మా కొట్టేది కాదు. అందరితో కలిసిమెలిసి ఉండేది. కష్టపడే తత్వం. శ్రమించి ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించుకుంది. ఆమె చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం.

కన్నీరు తెప్పించిన లేఖ

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: ఘటనాస్థలిలో దొరికిన లేఖలోని విషయాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ‘నేను ఇలా చేయడం తప్పని తెలిసినా తప్పడం లేదు. ఆకాష్‌ లేని జీవితం నాకు వద్దు.. నేను ఉండలేక ఇలా చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఒకటి తెలియాలి ఆకాష్‌ ఎందుకిలా చేశాడో. కానీ అది మార్చి 1న తెలుస్తుంది. వాడి చావుకు కారణమైన వారిని వదలకండి. చనిపోయే రోజు రాత్రి 2 గంటలకు వాడికి ఎవరో ఫోన్‌ చేశాడు.. వివరాలు కనుక్కోôడి. ఫోన్‌ చేసినోడే బావ చావుకి కారణం. వాటిని శివ అన్న ద్వారా తెలుసుకోండి. బావ చనిపోయినప్పుడు నేను చూడలేదు. అందుకే బావను కాల్చిన స్థలంలోనే నన్నూ కాల్చండి. మేము బతికి ఉండగా కలిసి ఉండలేకపోయాం. చనిపోయిన తర్వాత కలిసి ఉంటాం. నేను ఎవరికి భయపడి చనిపోవడం లేదు. వాడి ప్రేమకావాలి. వాడిని వదిలి ఉండలేక ఇలా చేశాను’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని