logo

నగదు రహితం.. ఆరోగ్య భరితం

మనం నిత్యం వాడే కరెన్సీ నోట్లు.. కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణం అవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు పరిశోధన ద్వారా నిరూపించారు.

Updated : 24 Feb 2024 06:35 IST

పరిశోధనల్లో వెల్లడించిన విద్యార్థులు

ప్రయోగశాలలో విద్యార్థులు

న్యూస్‌టుడే, సిద్దిపేట: మనం నిత్యం వాడే కరెన్సీ నోట్లు.. కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణం అవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు పరిశోధన ద్వారా నిరూపించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే జీవసాంకేతిక (బయోటెక్నాలజీ) శాస్త్ర విద్యార్థులు ఎ.రమ్య, కె.గాయత్రి, డి.శ్రీనిఖిత, ఆర్‌.అఖిల్‌కుమార్‌, పూజిత, కె.మౌనిక ‘కరెన్సీ నోట్ల ద్వారా బ్యాక్టీరియాల వ్యాప్తి’పై పరిశోధించారు. జీవసాంకేతిక శాస్త్ర సహాయ ఆచార్యులు, విభాగాధిపతి డా. జి.మదన్‌మోహన్‌ పర్యవేక్షణలో పరిశోధన సాగగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

గతేడాది నవంబరు చివర్లో  పరిశోధనను ప్రారంభించి జనవరిలో పూర్తిచేశారు. ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. కళాశాలలో బోధనా సిబ్బంది, విద్యార్థులు, రైతుబజారులో రైతులు, వినియోగదారులు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు, ప్రయాణ ప్రాంగణంలో కండక్టర్లు, బ్యాంకులు, హోటళ్లు, దుకాణా సముదాయాల్లో వినియోగదారుల కరెన్సీ నోట్ల నుంచి స్వాబ్‌ సేకరించారు. మొత్తం 96 నమూనాలు తీసుకొని యానకంలో ప్రవేశపెట్టి బ్యాక్టీరియాలను వెలికితీశారు. నమూనాల సేకరణకు 30 రోజులు, ఫలితాల నిర్ధారణకు 15 రోజులు పట్టింది. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.

అత్యధికం ఇక్కడే.. ఆసుపత్రుల పరిసరాల్లో వినియోగించే కరెన్సీలో అత్యధికంగా, హోటల్‌ వద్ద వినియోగించే వాటిల్లో అత్యల్పంగా బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. విభాగాల వారీగా.. ఆసుపత్రి-30 బ్యాక్టీరియాలు (సీఎఫ్‌యూ - కాలనీ ఫామింగ్‌ యూనిట్‌), ప్రయాణ ప్రాంగణం- 24, మార్కెట్‌- 18, దుకాణాలు- 15, బ్యాంకు- 13, విద్యార్థులు- 11, అధ్యాపకులు- 8, హోటల్‌లో వినియోగించే వాటిల్లో 7 మేర ఉన్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఏడు రకాలను గుర్తించారు. వాటి ద్వారా డయేరియా, గొంతు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

వ్యాప్తి ఇలా..  ప్రధానంగా కరెన్సీ నోట్లను లెక్కించే క్రమంలో నోటిలోని తడిని వాడటం కారణంగా బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

  • హోటళ్లలో టిఫిన్‌ చేసే ముందు చేతులు శుభ్రం చేసుకొని టోకెన్‌ తీసుకుంటారు. ఈ క్రమంలో డబ్బులు చేతులు మారుతుంది. ఆ తర్వాత నేరుగా అల్పాహారం తినడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది.
  • బ్యాంకులు లేదా ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత నిర్జలీకరణ చేయాలి. అందుకు నగదుపై యూవీ కిరణాలు ప్రసరింపజేస్తే నశిస్తాయి.
  • డబ్బు మారేపుడు లెక్కించిన తర్వాత చేతుల శుభ్రత తప్పనిసరి.
  • నగదు రహిత (ఆన్‌లైన్‌) లావాదేవీలు చేయడం ఉత్తమం.
  • వీటి స్థానంలో ప్లాస్టిక్‌ కరెన్సీ వినియోగించడం వల్ల వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది.
  • నోట్ల ముద్రణ సమయంలో వాటిని నశింపజేసే రసాయనాలు వాడాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని