logo

వసతుల కల్పన.. వన్యప్రాణులకు రక్షణ

వేసవిలో వన్యప్రాణులను రక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లాలో 58,186 హెక్టార్ల విస్తీర్ణమున్న అడవిలోని పక్షులు, జంతువుల సంరక్షణకు నీటి వసతులు కల్పిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నారు.

Published : 24 Feb 2024 02:53 IST

సాసర్‌ పిట్లలో నీరు నింపుతున్న సిబ్బంది

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: వేసవిలో వన్యప్రాణులను రక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లాలో 58,186 హెక్టార్ల విస్తీర్ణమున్న అడవిలోని పక్షులు, జంతువుల సంరక్షణకు నీటి వసతులు కల్పిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నారు. నీటి నిల్వకుంటలు, సాసర్‌ పిట్లు, చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. ఈసారి జిల్లాకు కేటాయించిన రూ.7 కోట్ల కంపా నిధులు వాడుకున్నారు. మొక్కల పెంపకం, సంరక్షణతోపాటు 20 చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. 42 పీటీల (పర్కులేషన్‌ ట్యాంకులు) పనులు నిర్వహిస్తున్నారు. వాటిలో 18 మాత్రమే పూర్తయ్యాయి. అందుబాటులో ఉన్న 520 సాసర్‌ పిట్లను శుభ్రం చేయడంతోపాటు వాటిలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతున్నారు. దీంతో అడవిలోని జంతువులకు పుష్కలంగా నీరు అందుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చెక్‌డ్యాంలు, నీటికుంటలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చెట్లు, గడ్డి పుష్కలంగా పెరుగుతుండడంతో శాకాహార జంతువులకు అవసరమైన ఆహారం సైతం లభిస్తుంది.

దాడుల నివారణకు చర్యలు..

దాహార్తి తీర్చుకునేందుకు నీటి వసతి వద్దకు వచ్చే జంతువులను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు ఉచ్చులు, వలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని కాపాడేందుకు ప్రత్యేకంగా నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి వెంటనే తొలగిస్తున్నారు.

నీటి వసతి కల్పిస్తున్నాం..

జిల్లాలో విస్తారంగా అడవులు విస్తరించి ఉండడంతో పలు రకాల జంతువులు పెరుగుతున్నాయి. వాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వేసవి ప్రారంభం అవుతుండడంతో జంతువులు శివారు ప్రాంతాలకు వస్తాయి. దీంతో పలుచోట్లు సాసర్‌పిట్లు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలను నిప్పుతున్నాం. వన్యప్రాణులను వేటాడితే కఠినంగా శిక్షిస్తాం.

రవిప్రసాద్‌, జిల్లా అటవీశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని