logo

దుకాణాలు వదలరు.. ఆదాయం పెరగదు!

జిల్లాలోని పురపాలికల దుకాణ సముదాయాల నుంచి ఆదాయం ఆర్జించే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, మేజర్‌ పంచాయతీల నుంచి పురాలుగా ఏర్పడిన నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటల్లో టెండర్లు నిర్వహించకుండా పాతవారికే కట్టబెట్టారు.

Published : 24 Feb 2024 02:56 IST

పురపాలక కార్యాలయ దుకాణ సముదాయం

న్యూస్‌టుడే- నర్సాపూర్‌, మెదక్‌ టౌన్‌, తూప్రాన్‌, రామాయంపేట: జిల్లాలోని పురపాలికల దుకాణ సముదాయాల నుంచి ఆదాయం ఆర్జించే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, మేజర్‌ పంచాయతీల నుంచి పురాలుగా ఏర్పడిన నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటల్లో టెండర్లు నిర్వహించకుండా పాతవారికే కట్టబెట్టారు. ఎప్పుడో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల రాజకీయ ఒత్తిళ్లతో ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి.

మెదక్‌లో ఇదీ పరిస్థితి..

మెదక్‌ పురపాలిక పటేల్‌కుంటలోని దుకాణాలు శిథిలావస్థకు చేరడంతో కూల్చివేసేందుకు వ్యాపారులకు తాఖీదులిచ్చినా ఏడాదిగా వారు ఖాళీ చేయడం లేదు. కూరగాయల మార్కెట్లో 20 వరకు కూల్చివేశారు. మరికొన్నింటి నిర్వహణ సరిగా లేదు. వ్యాపారులు కొన్నేళ్లుగా పాతుకుపోయారు. అద్దెలు సైతం సక్రమంగా చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో పుర ఆదాయానికి గండి పడుతోంది. చాలా దుకాణాల్లో బినామీలు తిష్టవేశారు. మెదక్‌ పాత బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న దుకాణాలకు ఇటీవల పుర అధికారులు కొత్తగా టెండరు ప్రక్రియను నిర్వహించగా.. 17 దుకాణాలకు 5.13 లక్షలు ఆదాయం సమకూరింది.

నర్సాపూర్‌లో ఏళ్లుగా పాతుకుపోయారు..

పుర దుకాణ సముదాయంలో కొన్నేళ్లుగా పాతుకుపోయారు. అద్దె సరిగా చెల్లించకున్నా వారిని ఖాళీ చేయించడం లేదు. కొన్నేళ్ల కిందట నిర్ణయించిన అద్దెలతోనే నెట్టుకొస్తున్నారు. ఆదాయం వచ్చే అవకాశమున్నా వదిలేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్‌ రోడ్డులో పుర కార్యాలయం ఎదురుగా ఆరు, మరోచోట మూడు దుకాణాలున్నాయి. తొలినాళ్లలో దక్కించుకున్న వారే ఇప్పటికీ ఉన్నారు. 2018 ఆగస్టులో పురపాలికగా మారింది. అద్దెల వసూళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వేర్వేరు అద్దెలు వసూలు చేస్తున్నారు. రూ.1500 నుంచి రూ.3వేలలోపే అద్దెలు ఉన్నాయి. పలువురు కౌన్సిలర్లు సాధారణ సమావేశాల్లోనూ విషయం లేవనెత్తినా చర్యలు మాత్రం తీసుకోలేదు. గతంలో పలుమార్లు అద్దెలు పెంచాలనే ప్రతిపాదన వచ్చినా రాజకీయ కారణాలతో అడుగు ముందుకు పడలేదు. కొన్ని దుకాణాలకు మరమ్మతులు చేసి అద్దెలు పెంచితే పురపాలికకు ఆదాయం వస్తుంది. ఇటీవల జరిగిన పుర బడ్జెట్‌ సమావేశంలో ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని పలువురు సూచించారు. కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ వద్ద ప్రస్తావించగా.. అద్దె బకాయిలు చెల్లించాలని దుకాణాదారులకు తాఖీదులు ఇచ్చామన్నారు. అద్దెలు పెంచడానికి టెండరు ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపామన్నారు.

  • తూప్రాన్‌లోనూ పురపాలికకు సంబంధించి పది దుకాణాలన్నాయి. మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు టెండరు వేసి కేటాయించారు. అప్పట్నుంచి పాతవారే కొనసాగుతున్నారు. ఏటా 13.5 శాతం అద్దెలు పెంచుతున్నారు. ప్రస్తుతం సుమారు రూ.5 లక్షల వరకూ బకాయిలున్నాయి.
  • రామాయంపేటలోనూ 13 దుకాణాల సముదాయముంది. వాటి నుంచి పురపాలికకు రూ.52 వేల ఆదాయం వస్తోంది. మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు టెండర్లు నిర్వహించారు. పురపాలికగా మారాక అందులో ఉన్నవారికే మూడేళ్లపాటు పొడిగించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు