logo

నవజాత శిశువులకు భరోసా!

సాధారణంగా పుట్టుకతో చిన్నారులను పలు రుగ్మతలు సోకుతుంటాయి. ఇవి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Published : 01 Mar 2024 01:05 IST

పుట్టిన 48 గంటల్లో ఆరోగ్య పరీక్షలు
సంగారెడ్డిలో ప్రయోగాత్మక సేవల అమలు

శిశువుకు పాలు తాగిస్తూ..

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: సాధారణంగా పుట్టుకతో చిన్నారులను పలు రుగ్మతలు సోకుతుంటాయి. ఇవి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి వారికి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించాలని సంకల్పించింది. పుట్టిన శిశువులకు 48 గంటల్లో ఐదు రకాల పరీక్షలు చేపట్టి, వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఈ సేవలు తొలుత హైదరాబాద్‌లోని నిలోఫర్‌లో అమలు అవుతున్నాయి. సంగారెడ్డిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడం విశేషం.

నెలకు 750కి పైగా కాన్పులు.. సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 150 పడకలు ఉన్నాయి. నవజాత శిశువుల కోసం పది పడకలతో పాటు అదనంగా 30 పడకలను చిన్నారులకు కేటాయించారు. నిత్యం 150 మంది 200 మంది వరకు గర్భిణులు, బాలింతలు ఆరోగ్య పరీక్షలకు తరలివస్తుంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లావాసులు సైతం వస్తుంటారు. నెలకు 750 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణి సమయంలో వైద్యుల సలహాలు, సూచనలు పాటించకపోవడం, తదితర కారణాలతో పుట్టిన బిడ్డలను పలు రోగాలు వేధిస్తుంటాయి. ఇలాంటి శిశువులకు వైద్య సేవలు అందేవి కావు. ఇకనుంచి ఇక్కడ చికిత్స అందించనున్నారు.

రక్త నమూనాలు సేకరించి.. జన్యుపరంగా హైపోథైరాయిడ్‌ వ్యాధితో శిశువులు సతమతం అవుతుంటారు. 811 మంది పిల్లల్లో ఒకరికి ఇది వచ్చే అవకాశం ఉంది. అడ్రినల్‌ హైపర్‌ ప్లాసియా 2009 మందిలో ఒకరికి, జీ6 పీడీ లోపం 932 మందిలో ఒకరికి, బయోటిడీస్‌ లోపం 1475 మందిలో ఒకరు, గాలెక్టోసీమియా 1340 మందిలో ఒకరు వ్యాధి బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు పుట్టిన 48 గంటల్లో శిశువు రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్‌కు పంపిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే సంగారెడ్డి ఎంసీహెచ్‌కు ఫలితాలను పంపిస్తారు. దీని ఆధారంగా చికిత్స అందిస్తారు. అత్యవసరమైతే నిలోఫర్‌కు తరలిస్తారు. ఏ వ్యాధి లేకుంటే సంబంధిత కుటుంబీకులకు నివేదిక చేరవేరుస్తారు. సంగారెడ్డి ఎంసీహెచ్‌లో ప్రయోగాత్మకంగా శిశువులకు వైద్యసేవలు అందించడం పేదలకు ఊరటనిచ్చేదే. ఐదు రకాల పరీక్షలకు ప్రైవేటులో సుమారు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. దీనికితోడు చికిత్స సైతం ఉచితంగా అందించనుండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు సైతం తొలుగుతాయి.

శిశువు రక్త నమునా సేకరిస్తూ..

కార్యక్రమ అమలుకు ఎంసీహెచ్‌లో నవజాత శిశువుల స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా సమన్వయకర్త శశాంక్‌ దేశ్‌పాండే ఆధ్వర్యంలో శిశువులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్‌కుమార్‌, మహిళా వైద్య నిపుణురాలు రాధిక, చిన్నపిల్లల వైద్యుడు షబ్బీర్‌అలీ, ఆర్‌ఎంవో రామాంజనేయులు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని