logo

కీలక పాఠ్యాంశాలు.. ఉత్తమ ఫలితాలు

మరో 18 రోజుల్లో పదో తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో కీలక పాఠ్యంశాలైన గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యేలా విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.

Published : 01 Mar 2024 01:07 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, సిద్దిపేట, మెదక్‌: మరో 18 రోజుల్లో పదో తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో కీలక పాఠ్యంశాలైన గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యేలా విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వీటికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించింది.

మూడు విభాగాలుగా.. మూడు అంశాల్లో పది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్న సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా ‘లక్ష్య’ పేరిట కార్యక్రమ అమలుకు విద్యాశాఖ గత జులైలో శ్రీకారం చుట్టింది. ఒకే ప్రణాళిక, ఒకే బోధన, ఒకే రీతిన సాధనకు చర్యలు చేపట్టింది. ఆయా సబ్జెక్టుల్లో ఓ పాఠం పూర్తవగానే లఘు ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. ఇలా ప్రతి అంశంలో 15కు పరీక్షలు చేపట్టారు. ఆ తర్వాత సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం ప్రీ ఫైనల్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బాగా చదివే వారు, మాములుగా చదివే వారు, వెనకబడిన వారు.. ఇలా మూడు భాగాలుగా విభజించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వీరిని ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ట్రస్థాయి బృందాలు మార్చి తొలివారంలో పాఠశాలలను సందర్శించనుంది.

దిశానిర్దేశం చేసి.. పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించారు. వారు విద్యార్థులను సన్నద్ధం చేసే తీరుపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా వారు కృషి చేసేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

పూర్తి అవగాహన..: మదన్‌గోపాల్‌, సైన్స్‌ ఉపాధ్యాయుడు, పోతిరెడ్డిపల్లి

భౌతిక, రసాయన శాస్త్రాలను విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తున్నాం. వెనకబడిన వారికి మెలకువలు నేర్పిస్తున్నాం. ఎలా రాయాలో సూచనలు చేస్తున్నాం. ఎక్కువ మార్కుల సాధనకు ఎలా చదవాలో వివరిస్తున్నాం. అందరూ ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

చొరవ తీసుకుంటున్నాం..: వెంకటేశ్వర్లు, సంగారెడ్డి డీఈవో

కీలక అంశాల్లో మంచి మార్కుల సాధనకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించాం. వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నాం. ఎంఈవోలు ప్రత్యేకంగా పరిశీలించి వారెలా చదువుతున్నారో పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు లోపాలను సవరిస్తున్నారు.

జిల్లా వారీగా విద్యార్థులు

మెదక్‌: 10,300
సిద్దిపేట: 9,400
సంగారెడ్డి: 9,171
వికారాబాద్‌: 9,200

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని