logo

కొలువుల వేదిక..నైపుణ్య వీచిక

సిద్దిపేట ఐటీ టవర్‌.. నిరుద్యోగ యువతకు బహుళార్థక వేదికగా మారింది. యువ విద్యార్థుల్లో ప్రేరణ కల్పిస్తోంది.

Published : 01 Mar 2024 01:08 IST

సిద్దిపేట ఐటీ సౌధంలో యువతకు శిక్షణ

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేట ఐటీ టవర్‌.. నిరుద్యోగ యువతకు బహుళార్థక వేదికగా మారింది. యువ విద్యార్థుల్లో ప్రేరణ కల్పిస్తోంది. ఈ సౌధంలో టాస్క్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని డిగ్రీ, తత్సమాన, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారికి కొలువుపై గురి పెట్టే దిశగా అవగాహన కల్పిస్తున్నారు. వివిధ కళాశాలల నిర్వాహకుల విన్నపం మేర దశల వారీగా తర్ఫీదుకు సిద్ధమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ కొలువును చెంతకు చేర్చడమే కాకుండా నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. గతేడాది జూన్‌ 15న సిద్దిపేట శివారు నాగులబండ వద్ద ఐటీ టవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో తొలి సౌధం ఇక్కడే మొదలవగా.. స్వల్ప వ్యవధిలో దాదాపు 19 కంపెనీలు భాగస్వాములయ్యాయి.

ఐటీ టవర్‌ అందుబాటులోకి వచ్చాక స్థానికంగా అవకాశాలు మెరుగయ్యాయి. ఈ సౌధంలో స్టార్టప్స్‌ సహా మల్టీ నేషన్‌ కంపెనీలు ఉండటం విశేషం. రెండు షిఫ్టులు (పగలు, రాత్రి) కొనసాగుతుండగా.. స్థానిక యువత అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 600 మందికి పైగా కొలువులు పొందారు. వీరిలో 60 శాతానికి పైగా స్థానికులే ఉన్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారూ ఉండగా, రూ.2.40 లక్షలు మొదలు రూ.15 లక్షల వరకు వార్షిక వేతనం అందుకుంటున్నారు.

టాస్క్‌ ఆధ్వర్యంలో.. అటు యువత, ఇటు కంపెనీలకు టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జి) వారధిగా మారింది. ఈ విభాగం ఆధ్వర్యంలో పలుమార్లు ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులతో పాటు డిగ్రీ, పీజీ, బీటెక్‌, తత్సమాన విద్యార్హతలు ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నారు. వారానికి సగటున 50 మంది తర్ఫీదు పొందుతున్నారు. ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది. యువ విద్యార్థులు వివరాలు నేరుగా టవర్‌లోని టాస్క్‌ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. బ్యాచ్‌ల వారీగా సమాచారం ఇస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.

అన్ని అంశాలపై..వివిధ కంపెనీలు ఎంపిక చేసిన తర్వాత టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. ఆ తదుపరి అవసరాలకు అనుగుణంగా కంపెనీ ప్రతినిధులు మెలకువలు నేర్పిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు రెండు రోజులు మొదలు వారం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంపికైన అభ్యర్థుల ఆధారంగా శిక్షణ కొనసాగిస్తున్నారు. సాంకేతిక అంశాలైన పైతాన్‌, జావా, సీ, సీ++, డీబీఎంఎస్‌, తదితర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర వాటిని బోధిస్తున్నారు. సాఫ్ట్‌ స్కిల్స్‌లో భాగంగా ఆంగ్లం, భావ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలు, బృంద చర్చలు, ముఖాముఖి సన్నద్ధతపై వివరిస్తున్నారు. నైపుణ్యం ఉన్న శిక్షకులు తర్ఫీదు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శిక్షణ పొందిన వారిలో అర్హులను కంపెనీలుగా నేరుగా కొలువులకు ఎంపిక చేస్తున్నాయి.

సందర్శన.. మార్గదర్శనం.. ఇటీవల జిల్లాలో డిగ్రీ, ఆపై స్థాయి ఉన్న కళాశాలల విద్యార్థులకు ఐటీ టవర్‌ సందర్శన కార్యక్రమాన్ని తలపెట్టారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. టాస్క్‌ చేపడుతున్న కార్యక్రమాలు, అందుబాటులో ఉన్న కంపెనీలు, ఉద్యోగ సాధన తీరును వివరిస్తున్నారు. ఎలా సనద్ధం కావాలి, నైపుణ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చెబుతున్నారు. అంతిమంగా చదువుకునే దశలో ఐటీ ఉద్యోగాలపై ఆసక్తి పెంచుతున్నారు. దీన్ని నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించారు.

సద్వినియోగం చేసుకోండి: ముత్యంకుమార్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా మేనేజర్‌, టాస్క్‌

డిగ్రీ, తత్సమాన విద్యార్హత ఉన్న వారికి టాస్క్‌ ఆధ్వర్యంలో ఐటీ టవర్‌లో శిక్షణ ఇస్తున్నాం. సద్వినియోగం చేసుకోవాలి. కళాశాలల్లో డిగ్రీ చదివే వారికీ అవకాశం ఉంటుంది. ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాం. గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న, ఆ తర్వాత సిద్దిపేటలోని కళాశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగించనున్నాం. సిద్దిపేట సహా హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేందుకు యువత సిద్ధంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని