logo

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగార్థి హృదయం

ఉపాధ్యాయ కొలువును సాధించేందుకు తపిస్తున్న ఎంతోమంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Published : 01 Mar 2024 01:09 IST

311 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్గం సుగమం

తరగతి గదిలో విద్యార్థులు

న్యూస్‌టుడే, సిద్దిపేట: ఉపాధ్యాయ కొలువును సాధించేందుకు తపిస్తున్న ఎంతోమంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ కావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాల సర్కారు బడుల బలోపేతానికి మార్గం సుగమమైంది. ఉపాధ్యాయుల కొరత తీరనుంది. 2016 తరువాత ఇప్పటి వరకు డీఎస్సీ నిర్వహించలేదు. ఏళ్ల నిరీక్షణ తరువాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ముందడుగు పడటం ఊరటగా మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత డిసెంబరు నుంచే నోటిఫికేషన్‌ వెలువరిస్తామంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో ఇప్పటికే పలువురు శిక్షణ కేంద్రాల బాటపట్టడం గమనార్హం.

49 మూతపడ్డాయి.. జిల్లాలో ప్రాథమిక - 638, ప్రాథమికోన్నత - 115, ఉన్నత పాఠశాలలు - 227 కొనసాగుతున్నాయి. ఆయా వాటిల్లో 82,946 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వారిపై ఒత్తిడి పెంచడంతో ఆ ప్రభావం విద్యార్థి చదువు, ఫలితాలపై చూపుతోంది. ఈ తరుణంలో అప్పటి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న డీఎస్సీ ప్రకటన చేసినా.. ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో ఫలితం లేకపోయింది. అప్పట్లో జిల్లాలో 141 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపవడం విశేషం. మరోవైపు ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని, మూతపడిన వాటిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో 49 మూతపడ్డాయి. విద్యార్థులు లేకపోవడం, ఇతరత్రావి అందుకు కారణమయ్యాయి. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్‌ చేశారు. డీఎస్సీ నియామకాలు సకాలంలో పూర్తయితే మూతపడినవి తెరవడంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న చోట్ల గురువుల కొరత తీరనుంది.

పెరిగిన పోస్టులు.. పెద్దసంఖ్యలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం సుదీర్ఘంగా ఎదురుచూశారు. ఆ విభాగంలో 20 వేలకు పైగా ఉంటుందనేది ఒక అంచనా. వివిధ దశల్లో టెట్‌ను అర్హత సాధించిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ తరుణంలో పోస్టుల సంఖ్య పెరగడంతో పలువురిలో ఆశలు చిగురించాయి. ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పిస్తే ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

విభాగాల వారీగా భర్తీ చేయనున్న పోస్టులు ఇలా.. ఎస్‌ఏ సాంఘికశాస్త్రం - 31, బయోసైన్స్‌ - 18, తెలుగు - 8, ఇంగ్లిషు - 6, గణితం - 5, హిందీ - 4, భౌతికశాస్త్రం - 3, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌-1, ఉర్దూ-1. ఎస్జీటీ తెలుగు మాధ్యమం - 157, ఉర్దూ మాధ్యమం - 10. పీఈటీలు - 8, భాషా పండితుల విభాగంలో హిందీ - 15, తెలుగు - 9. ఈసారి కొత్తగా భవిత కేంద్రాల్లోనూ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కింద ఎస్‌ఏ హోదాలో 9, ఎస్టీజీ హోదాలో 26 పోస్టులు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని