logo

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఎట్టకేలకు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశముంది. ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడం.. మరో వైపు వాలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థుల బోధనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 01 Mar 2024 01:10 IST

జిల్లాలో భర్తీకానున్న 551 ఉపాధ్యాయ పోస్టులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎట్టకేలకు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశముంది. ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడం.. మరో వైపు వాలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థుల బోధనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించి బోధన చేయించేవారు. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం  ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బడుల్లో భారీగా ఖాళీలు: జిల్లాలో 1,248 పాఠశాలల్లో 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్నిచోట్లా కలిపి మొత్తం 1,322 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గతంలో నివేదికలు తయారు చేసింది. తాజాగా ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద జిల్లాలో 551 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుత డీఎస్సీ ద్వారా సగం ఖాళీ పోస్టులు మాత్రమే భర్తీ కానున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో ఐదు తరతులకు ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక తరగతుల విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. విద్యార్థులు చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల్లో కనీస ప్రమాణాలు అందుకోవడం లేదు. బడుల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. పదో తరగతి బోధనకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో రెండు సంవత్సరాలుగా వాలంటీర్లతో నెట్టుకొస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్ల నియామకం వల్ల ఈ పాఠశాలల్లో కొంతమేరకు సమస్య తీరనుంది.

ప్రత్యేక విభాగంలోనూ..: పాఠశాలల్లో ఈ సారి ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన చేయనున్నారు. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ కేటగిరీ కింద 44 పోస్టులు కేటాయించారు. మొదటి సారి ఈ పోస్టులు భర్తీ చేయడంతో దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని