logo

నిధులు లేక.. నిర్వహణ కరవు

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు భరోసా కల్పించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. 

Published : 01 Mar 2024 01:12 IST

జిల్లాలో రైతు వేదికల తీరిది

అంగడిపేటలో అపరిశుభ్ర పరిసరాల మధ్య రైతువేదిక

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట టౌన్‌, జిన్నారం, మనూరు: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు భరోసా కల్పించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది.  ఇంతవరకు బాగానే ఉన్నా.. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

పరికరాలు, ఫర్నిచర్‌కు భద్రత ఏదీ?

జిల్లాలో క్లస్టర్లవారీగా 116 చోట్ల రైతు వేదికలు నిర్మించారు. ఏవో, ఏఈవో, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు అందులో సమావేశమయ్యేలా వసతులు కల్పించారు. సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, రాయికోడ్‌, జోగిపేట, పటాన్‌చెరు సబ్‌ డివిజన్ల పరిధిలో.. డివిజన్‌కు ఒకటి చొప్పున దృశ్య శ్రవణ కేంద్రాలుగా రైతు వేదికలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందోలు డివిజన్‌లో డాకూరు, పటాన్‌చెరు డివిజన్‌ జిన్నారం మండలం సోలక్‌పల్లి, సంగారెడ్డి డివిజన్‌ కొండాపూర్‌, నారాయణఖేడ్‌ పరిధి సిర్గాపూర్‌, రాయికోడ్‌, జహీరాబాద్‌ డివిజన్‌ అల్లీపూర్‌లోని రైతు వేదికలను ఇందుకోసం ఎంపిక చేశారు. వాటిలో ఇంటర్నెట్‌, తదితర సౌకర్యాల కల్పనకు రూ.3.70లక్షల చొప్పున కేటాయిస్తారు. త్వరలో ఆయా కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతు వేదికల్లో గతంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ తదితరాలు చోరీకి గురవుతున్నాయి. తలుపులు, కిటికీలను ఆకతాయిలు విరగ్గొడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో డిజిటర్‌ యంత్రాలు ఏర్పాటు చేస్తే భద్రత ఎలాగని పలువురు పేర్కొంటున్నారు.

రెండేళ్లు గడిచినా..: జిల్లాలో 116 రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.9వేల వంతున ప్రభుత్వం మంజూరు  చేయాల్సి ఉండగా.. రెండేళ్ల నుంచి ఒక్కపైసా కూడా కేటాయించలేదు. విద్యుత్తు ఛార్జీలు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతులు, స్టేషనరీ, రైతులకు శిక్షణ, తాగునీటికి వెచ్చించడానికి ఆయా నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు లేవు. కొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగాయి.

క్షేత్ర స్థాయి పరిస్థితి

అందోలు మండలం డాకూర్‌, చింతకుంట, సంగుపేట, అక్సాన్‌పల్లి గ్రామాల శివారుల్లో రైతు వేదికలను నిర్మించారు. ఒక్కో నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించింది. గ్రామానికి దూరంగా ఉండటంతో రైతు వేదికలు ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా మారాయి. ఫర్నిచర్‌ చోరీకి గురవుతోంది.  సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో జాతీయ రహదారి పక్కనే రైతు వేదిక నిర్మించారు. ఇక్కడి 25 కుర్చీలు, రెండు ఫ్యాన్లకు దొంగలు ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌, రాయికోడ్‌ తదితర చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

త్వరలో బకాయిలు విడుదలవుతాయి

రైతు వేదికల్లోని ఫర్నిచర్‌, పరికరాలు ఎవరైనా చోరీ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. వాటి నిర్వహణ నిధులు రెండేళ్లుగా విడుదల కాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది. రైతు వేదికల్లో అన్నదాతలకు ఉపయోగపడేలా దృశ్య మాధ్యమ యంత్రాలు త్వరలో ఏర్పాటు చేస్తాం.

నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని