logo

పారిశ్రామిక ఊతం.. ప్రగతికి దోహదం

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 01 Mar 2024 01:13 IST

‘ఐలా’ కార్యవర్గాల ఎన్నికలకు కసరత్తు

పారిశ్రామికవాడ

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశ్రామికవాడల్లో అభివృద్ధికి దోహదం చేసే ఐలా కార్యవర్గాలు ప్రస్తుతం అన్నిచోట్ల లేకపోవడంతో అభివృద్ధి ఇంతకాలం కుంటుపడింది. పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రగతి పరుగులెత్తించేందుకు ఐలా ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలు ఏర్పాటుచేయాలని ఓ సర్క్యులర్‌ విడుదలైంది.

పటాన్‌చెరు పరిధిలో..

పటాన్‌చెరు నియోజవర్గంలో పటాన్‌చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి ఆరు పారిశ్రామికవాడలున్నాయి. పటాన్‌చెరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో పారిశ్రామికవాడగా పేరొందింది. ఇందులో పటాన్‌చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, సుల్తాన్‌పూర్‌, టీఎస్‌ఐఐసీ ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు కాగా ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి ప్రైవేటుగా ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు. టీఎస్‌ఐఐసీ పరిధిలో కొత్తగా ఈ మధ్య సుల్తాన్‌పూర్‌ పారిశ్రామికవాడ ఏర్పాటుచేయగా కాలుష్యంలేని పరిశ్రమలు కొన్ని ఏర్పాటుచేశారు. ఇక శివానగర్‌, ఐనోల్‌, చిట్కుల్‌ పరిధిలో పారిశ్రామికవాడలు ఏర్పాటైనా ఇంకా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలేదు.

ప్రయోజనాలు ఇలా..: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఐలా కార్యవర్గ గడువు 2022 సెప్టెంబరు 17తో ముగిసినా కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో పారిశ్రామికవాడలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, ఆక్రమణలు, అభివృద్ధికి నిధుల కొరతతో పారిశ్రామికవాడ అభివృద్ధి కుంటుపడుతోంది.

  • నిబంధనల ప్రకారం ఐలా ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 65శాతం సభ్యత్వ రుసుము వసూలు చేసి వారందరూ ఎన్నికల్లో పాల్గొని ఐలా ఛైర్మన్‌తోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
  • దీనిపై పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఒక తాటిపైకి వచ్చి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకోవాలని కసరత్తు చేస్తున్నారు. ః ఇక పాశమైలారం పారిశ్రామికవాడలో గతంలో ఎన్నుకున్న కార్యవర్గానికి మార్చి వరకూ గడువు ఉన్నా.. వివాదాల మూలంగా పారిశ్రామికవేత్తలు సమావేశం నిర్వహించుకుని కొత్త కార్యవర్గం ఏర్పాటుచేసుకునే యోచనలో ఉన్నారు.
  • రామచంద్రాపురం పారిశ్రామికవాడలో ఇప్పటికే ఐలా కార్యవర్గం ఉంది. ఇక సుల్తాన్‌పూర్‌లో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 65శాతం ఆస్తిపన్ను వసూలైతే అక్కడా ఎన్నికలు జరిగే అవకాశముంది.

నిబంధనల ప్రకారమే ఎన్నికలు

రామచంద్రాపురంలో ఐలా కార్యవర్గం ఉంది. పాశమైలారంలో ఐలా కార్యవర్గ ఎన్నిక చేసుకుంటున్నామని ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. పటాన్‌చెరులో మాత్రం ఐలా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే పారిశ్రామికవేత్తలు తెలిపారు. ఎక్కడ జరిపినా నిబంధనల ప్రకారమే ఐలా ఎన్నికలు నిర్వహిస్తాం.

అనూరాధ, టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని