logo

లోక్‌సభ బరి.. ఆశావహుల గురి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి టికెట్‌ ఆశించే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Published : 01 Mar 2024 01:14 IST

జహీరాబాద్‌ టికెట్‌ కోసం జోరుగా ప్రయత్నాలు

న్యూస్‌టుడే, జహీరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జహీరాబాద్‌ లోక్‌సభ స్థానానికి టికెట్‌ ఆశించే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ లోక్‌సభ పరిధిలో కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలున్నాయి. పొరుగునే కర్ణాటక, మహారాష్ట్ర ఉండటంతో అక్కడి కొందరు నేతలు కూడా టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలూ జహీరాబాద్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని యోచిస్తున్నాయి.

శ్రేణులను సన్నద్ధం చేస్తూ ముందుకు..: మార్చిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశమున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ భారాస, భాజపాలు కసరత్తు ప్రారంభించాయి. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్స్‌వాడ, మెదక్‌ జిల్లా పరిధిలోకి పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్‌, రేగోడ్‌ మండలాలు వస్తాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ.. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

భారాస నుంచి పలువురు

భారాస నుంచి ఐదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎంపీ బీబీపాటిల్‌ మరోసారి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని శాసనసభ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు టికెట్‌ ఆశిస్తూ ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్‌: అధిష్ఠానం ప్రసన్నానికి ప్రయత్నాలు

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ టికెట్టును ప్రధానంగా ఆరుగురు ఆశిస్తున్నారు. వీరు ఇటీవల టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ, నారాయణఖేడ్‌కు చెందిన సురేష్‌కుమార్‌ శెట్కార్‌, జహీరాబాద్‌కు చెందిన ఎన్నారై ఉజ్వల్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తమ వారసులను పోటీలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కూడా టికెట్టును ఆశిస్తున్నారు.

భాజపా: నేతల జాబితా ఎక్కువే

భాజపా నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జిల్లా నేతలతో పాటు ఎన్‌ఆర్‌ఐలు కలిసి సుమారు 35 మందికి వరకు ఆశావహులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. జహీరాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ ఎం.బాగారెడ్డి తనయుడు ఎం.జైపాల్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర తనయుడు ఆలె భాస్కర్‌, కామారెడ్డి జిల్లాకు చెందిన పైడి ఎల్లారెడ్డి, చీకోటి ప్రవీణ్‌, పలువురు సినీరంగానికి చెందినవారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరు ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని పట్టణాల్లో విసృతంగా పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం ఆయా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని