logo

నిరుద్యోగుల కల.. నెరవేరనున్న వేళ

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు పడడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

Published : 01 Mar 2024 01:15 IST

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు

పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

న్యూస్‌టుడే, మెదక్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు పడడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావ్యవస్థలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా విద్యారంగం బలోపేతం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.

ఎస్జీటీ ఖాళీలే ఎక్కువ... జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితులు, వ్యాయామ విద్య పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని కేటగిరీలు కలిపి 310 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌తో ఇవి భర్తీ కానున్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేస్తోంది. ఖాళీల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. భాషాపండితులు, ప్రత్యేక కేటగిరీతో కలిపి 209, స్కూల్‌ అసిస్టెంట్‌లో ఆయా సబ్జెక్టులు కలిపి 101 పోస్టులున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆధారంగా జిల్లాలో 147 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీతోపాటు మరికొన్ని ఖాళీలు చూపడంతో ఆ సంఖ్య 310కి చేరింది. డీఎస్సీ పరీక్ష రాయాలంటే టెట్‌లో అర్హత సాధించాలి.

తొలగనున్న ఇబ్బందులు...ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో ప్రభుత్వ బడుల్లో నెలకొన్న ఇబ్బందులు తీరనున్నాయి. ఇటీవల ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. కోర్టు కేసుల కారణంగా అవి నిలిచిపోయాయి. ఒకవేళ పదోన్నతుల ప్రక్రియకు ముందడుగు పడితే.. ఆయా పోస్టుల్లో నూతన డీఎస్సీ ద్వారా ఎంపికైన వారిని భర్తీ చేసే అవకాశముంది. ఒకవేళ పదోన్నతులు కల్పించకున్నా... ఖాళీలున్న చోట కొత్త వారిని నియమించే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీతో బోధన సక్రమంగా సాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని