logo

సాగు లెక్క.. ఇక పక్కా..

పంటల సాగు పక్కాగా తేలింది. రైతులు జిల్లాలో ఎంత మేర సాగు చేశారో తెలియక వ్యవసాయాధికారులు ఇబ్బందులు పడుతుండేవారు.

Published : 01 Mar 2024 01:17 IST

అంతర్జాలంలో వివరాల నమోదు

న్యూస్‌టుడే, చేగుంట: పంటల సాగు పక్కాగా తేలింది. రైతులు జిల్లాలో ఎంత మేర సాగు చేశారో తెలియక వ్యవసాయాధికారులు ఇబ్బందులు పడుతుండేవారు. దీనిని అధిగమించేందుకు ఈ సీజన్‌లో పంటల వివరాలకు సంబంధించి గణన పూర్తిచేశారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. యాసంగిలో ఏ రైతు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి పంట వేశారు.. ఆ భూమి సర్వే నంబరు, రైతు పేరు, ఊరుపేరు, చరవాణి నంబరు తదితర వివరాలతో కూడిన గణన చేపట్టారు. గతంలో రైతులు చెప్పిన వాటినే నమోదు చేసుకునేవారు. కానీ ఈ సీజన్‌లో నేరుగా పంట వద్దకు వెళ్లి చూస్తేనే సర్వే నంబరుతో సహా కచ్చితమైన వివరాలు నమోదయ్యాయి.

ఇబ్బంది లేకుండా.. సాగు వివరాలు ఆన్‌లైన్‌లో సరిగా లేక కొనుగోళ్ల సమయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారుల వద్దకు రైతులు వెళ్లి తిరిగి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావడం, అప్పటివరకు ఆలస్యం కావటం, వర్షాలు కురిస్తే పంటలు పాడవడం వంటివి సంఘటనలు ప్రతీ సీజన్‌లో చోటుచేసుకుంటున్నాయి.

నేరుగా అన్నదాతలకు.. రైతు యూనిట్‌గా పంటల గణన చేపట్టారు. రైతు ఖాతాను తెరవగానే ఆయనది ఏ గ్రామం, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారనే వివరాలన్నీ తెరపై కనిపిస్తాయి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగంగా జరిగిపోతాయి. అంతేకాకుండా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందుతారు. ప్రసుత్తం మెదక్‌ జిల్లాలో 76 క్లస్టర్లలో వ్యవసాయ భూములు 3,97,480 ఎకరాలు ఉన్నాయి. రైతులు 2,21,623 మంది ఉండగా2,73,128 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి.

కర్షకుల మేలు కోసమే: గోవింద్‌, డీఏవో, మెదక్‌

కర్షకుల మేలు కోసమే గణన చేపట్టాం. వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాం. దీంతో పంటల కొనుగోళ్ల సమయంలో ఎవరికి ఇబ్బందులుండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని