logo

నిప్పులు కురిపిస్తున్న భానుడు

జిల్లాలో ఈ వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ ఆరంభంలోనే ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

Updated : 03 Apr 2024 06:42 IST

 ఏప్రిల్‌లోనే 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖ

 న్యూస్‌టుడే, సిద్దిపేట: జిల్లాలో ఈ వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ ఆరంభంలోనే ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు మండిపోతున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న క్రమంలో ఎండలో అనవసరంగా తిరిగి ఇబ్బందులు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

విస్తృత అవగాహన: జిల్లాలో మధ్యాహ్నం వేళల్లో వడగాలులు వీస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు వివిధ పనుల నిమిత్తం బయట తిరిగే వారిపై చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలు మండుతున్న వేళ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 1.50 లక్షల ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) పొట్లాలను సిద్ధం చేశారు. జ్వరాలు, వాంతులు, విరేచనాల నుంచి కోలుకునేందుకు అవసరమైన ఔషధాలు, ఐవీ ఫ్లూయెడ్స్‌ను అందుబాటులో పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యుడు, సీహెచ్‌వో/హెచ్‌ఈవో, స్టాఫ్‌నర్సు, ఉప కేంద్రం పరిధిలో ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా, ఏఎన్‌ఎం, ఆరోగ్య సూపర్‌వైజర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా అవగాహన విస్తృతం చేయనున్నారు. ఉపాధి హామీ పనుల వద్ద ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఎక్కువ ప్రమాదం కలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని జాగ్రత్తలు సూచించనున్నారు. వడదెబ్బ బారినపడితే కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే వివిధ స్థాయిలో ఆరోగ్య సిబ్బంది, అధికారులకు వైద్యాధికారులు దిశానిర్దేశం చేశారు.

అందుబాటులో కంట్రోల్‌ రూం:

జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూం సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఏవైనా సందేహాల నివృత్తి, సలహాలు, సూచనల కోసం చరవాణి నం.63036 96647 సంప్రదించవచ్చు. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఛైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్‌ కన్వీనర్‌గా, డిప్యూటీ వైద్యాధికారులు వినోద్‌బాబ్జీ, శ్రీనివాస్‌, ప్రభాకర్‌ సమన్వయకర్తలుగా, మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాలు, పని ప్రాంతాల్లో కూలీలు, కార్మికులు సహా చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • సరిపడా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. రోజులో కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.   
  •  ఎండలో అలసిపోతే ఓఆర్‌ఎస్‌, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి.
  • ఇంట్లో తయారీ చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. పుచ్చకాయ, సంత్ర, దోసకాయ, ద్రాక్ష పండ్లు తినాలి.
  • లేతరంగు కలిగిన నూలు వస్త్రాలు ధరించాలి. వదులుగా ఉన్నవి వినియోగించడం మేలు.
  •  ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు, టోపీ, రుమాలు వినియోగించాలి.  

సిద్ధంగా ఉన్నాం..: పుట్ల శ్రీనివాస్‌, జిల్లా వైద్యాధికారి

వైద్యశాఖాపరంగా సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లొద్దు. మిగిలిన వారు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఆహారాన్ని ఉదయాన్నే వండుకోవడం ఉత్తమం. మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. పని ప్రదేశాల్లో తాగునీటిని సమకూర్చాలి. ఓఆర్‌ఎస్‌ పొట్లాలు సిద్ధంగా పెట్టుకోవాలి. వడదెబ్బ తగిలితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని