logo

మెదక్‌ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?

అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇందిర ఓడిపోయారు.

Updated : 23 Apr 2024 16:54 IST

సర్పంచుల సదస్సులో పాల్గొన్న ఇందిరాగాంధీ

న్యూస్‌టుడే, మెదక్‌: అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇందిర ఓడిపోయారు. కేంద్రంలో జనతా పార్టీ కొలువుదీరింది. ఏపీ, కర్ణాటకలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఆ పార్టీ నాయకులు ఇందిరను లోక్‌సభకు పంపించాలని కంకణం కట్టుకున్నారు. దీంతో 1978లో కర్ణాటకలోని అప్పటి చిక్‌మగ్‌ళూరు ఎంపీ వీరేంద్రపాటిల్‌ రాజీనామా చేయగా, ఆమె పోటీ చేశారు. రెండేళ్లకే జనతా ప్రభుత్వం పడిపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా, ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీ, మెదక్‌ నుంచి బరిలో దిగారు. పార్టీ పరిస్థితిపై సర్వే చేయించి విజయావకాశాలు గుర్తించి మెదక్‌ను ఎంచుకున్నారు.

ప్రత్యర్థి జైపాల్‌రెడ్డి.. మధ్యంతర ఎన్నికల్లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్‌(ఐ), జనతా పార్టీ నుంచి సూదిని జైపాల్‌రెడ్డితో పాటు జనతా (ఎస్‌) పార్టీ నుంచి కేశవరావ్‌జాదవ్‌ స్వతంత్రులుగా గంటాబాబు, శకుంతలాదేవి పోటీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత బాగారెడ్డి తమ అధినేత్రికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించారు. ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు. మొత్తం 4,45,289 ఓట్లు పోలవగా.. అందులో 3,15,077 (67.9) శాతం ఇందిరాగాంధీకే లభించడం విశేషం. సమీప ప్రత్యర్థి జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. 2,32,624 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన బాగారెడ్డికి ఆ తర్వాతి ఎన్నికల్లో టికెట్‌ లభించింది.

మెదక్‌ ఎంపీగానే.. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లను గెలుచుకోగా ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. రాయ్‌బరేలీలోనూ గెలవగా, ఆ స్థానాన్ని వదులుకొని మెదక్‌ ఎంపీగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. ప్రధాని హోదాలో ఆమె పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశానికి హాజరయ్యారు. 1984 జులై 19న మెదక్‌లో జరిగిన సర్పంచుల సదస్సులోనూ పాల్గొన్నారు. మెదక్‌లో పలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురయ్యే నాటికి మెదక్‌ ఎంపీగానే కొనసాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని