logo

పెట్రోల్‌ దొంగలతో పరేషాన్‌

పెట్రోల్‌ దొంగలు పెట్రేగి పోతున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీరాంనగర్‌లోని ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలో పెట్రోల్‌ చోరీ చేస్తున్న దృశ్యం నిక్షిప్తమైంది.

Updated : 13 Apr 2024 05:49 IST

యాదగిరిగుట్టలో.. ఇటీవల ద్విచక్రవాహనం నుంచి ఓ దొంగ పెట్రోల్‌ తీస్తున్నట్లుగా సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యం
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: పెట్రోల్‌ దొంగలు పెట్రేగి పోతున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీరాంనగర్‌లోని ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలో పెట్రోల్‌ చోరీ చేస్తున్న దృశ్యం నిక్షిప్తమైంది. చాలా నివాసాల వద్ద ద్విచక్ర వాహనం నిలిపే సౌకర్యం లేక ఆరుబయటే పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా అర్ధరాత్రి వేళ చోరులు గుట్టు చప్పుడు కాకుండా వాహనాల నుంచి పెట్రోల్‌ తీస్తూ ఉడాయిస్తున్నారు. ద్విచక్రవాహనం ట్యాంకు నుంచి ఇంజిన్‌లోకి పెట్రోల్‌ తీసుకెళ్లే పైపు ద్వారా సునాయాసంగా ప్లాస్టిక్‌ బాటిళ్లలో నింపుతున్నారు. ముఖ్యంగా గంజాయి, మద్యానికి బానిసలైన యువత, ఇతర జల్సాలకు అలవాటు పడిన వారు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పెట్రోలు తస్కరిస్తున్నారు. ప్రస్తుతం లీటరుకు పెట్రోల్‌ రూ.109.66 ఉంది. దొంగలు చోరీ చేసింది రూ.60 నుంచి రూ.80 మధ్య దుకాణాలు, వాహనదారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసర సమయంలో తమ ద్విచక్రవాహనం పెట్రోల్‌ లేక ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అడ్డుకట్ట వేయడానికి రాత్రివేళలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ చేపట్టాలని, సీసీ కెమెరాల నిఘా ద్వారా వారి ఆటకట్టించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దీనిపై యాదగిరిగుట్ట సీఐ రమేశ్‌ దృష్టికి తీసుకుపోగా రాత్రివేళ పెట్రోలింగ్‌ మరింత పెంచుతామన్నారు. రాత్రివేళ దొంగలను గమనించినా, అనుమానిత వ్యక్తులు కనిపించినా జనాలు బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని