logo

తడి పొడి.. తడబడి

చెత్తను వృథాగా పడవేయొద్దు.. చక్కగా వినియోగించుకుంటే ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం పంచాయతీలకు నిర్దేశించింది

Updated : 13 Apr 2024 05:49 IST

నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్డు

ఆలేరు, న్యూస్‌టుడే: చెత్తను వృథాగా పడవేయొద్దు.. చక్కగా వినియోగించుకుంటే ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం పంచాయతీలకు నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రతీ పంచాయతీలో డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లను ఏర్పాటు చేయించింది. తడి, పొడి చెత్త విభాగాలను నెలకొల్పారు. పొడి చెత్తలోని గాజు సీసాలు, కాగితాలు, అట్టముక్కలు, ఇనుప వ్యర్థాలను వేరు చేయాలి. తడి చెత్తను ప్రత్యేక పద్ధతిలో నిల్వచేసి కంపోస్ట్‌ ఎరువుగా మార్చాలి. దీనిని విక్రయించి ఆదాయం గడించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రక్రియ జిల్లాలో అంతంత మాత్రంగానే అమలవుతోంది.

 ఆకతాయిలకు అడ్డాలుగా...

 యాదాద్రి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో రూ.2.5 లక్షలతో కంపోస్ట్‌ షెడ్లను నిర్మించారు. ఇందుకోసం సుమారు రూ.10 కోట్లను ఖర్చు చేశారు. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, కొన్ని పంచాయతీలకు రిక్షాలను కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికి ప్రత్యేక బుట్టలు అందించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ...షెడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో షెడ్లు వినియోగంలేక కొన్నిచోట్ల ఆకతాయిలకు, పేకాట రాయుళ్లకు, మందు బాబులకు అడ్డాగా మారుతున్నాయి.

గ్రామాల్లో ఏం జరుగుతోందంటే..

* కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం, వాటి వినియోగంపై పంచాయతీ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహణ భారం కావడంతో సుమారు ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే ఎరువు తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా గ్రామాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి.  
* చాలా గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా కొనసాగడం లేదు. కొన్నిచోట్ల గ్రామస్థులు చెత్తను వేర్వేరు డబ్బాలలో వేసినప్పటికీ పంచాయతీల కార్మికులు మాత్రం ఒకే రిక్షాలో వేయడం వల్ల అవి కలిసి పోతున్నాయి. కొన్నిచోట్ల రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తతో కలిపి అక్కడే కాల్చి వేస్తున్నారు.
* మరికొన్ని గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్ట్‌ షెడ్ల వద్దకు తీసుకెళ్లి నిల్వ చేస్తున్నారు. తడి చెత్తను, ఆహార వ్యర్థాలను నాడెపు కంపోస్ట్‌ షెడ్లలో వేసినప్పటికీ పేడ, మట్టిని వేయకపోవడం, నిత్యం నీటిని పట్టకపోవడంతో ఎండిపోయి వృథాగా మారుతున్నాయి.


   ఎరువుల తయారీకి చర్యలు: ఎం.డి.సలీం, ఎంపీవో ఆలేరు  

ఆలేరు మండలంలో కంపోస్ట్‌ షెడ్లలో ఎరువుల తయారీపై దృష్టి సారించాం. పంచాయతీ కార్యదర్శులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని